దొండకాయ ఆవకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే పండుగే!
తెలుగు ఇళ్లలో ఆవకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఆవకాయ అంటే కేవలం మామిడికాయతో చేసే నిల్వ పచ్చడి అనుకుంటే పొరబాటే. మామిడికాయ కేవలం వేసవిలోనే దొరుకుతుంది కాబట్టి ఏడాది పొడవునా ఆవకాయ రుచి కావాలంటే రకరకాల కూరగాయలతో ఆవకాయ పచ్చడి పెడతారు. దోసకాయ ఆవకాయ, దొండకాయ ఆవకాయ ఇలా ఆవకాయ పచ్చడిఏ కూరగాయతో చేసినా అద్భుతంగానే ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
పచ్చి, గట్టి దొండకాయలు - 3 కప్పుల ముక్కలు
పచ్చడి కారం - అర కప్పు
ఆవపిండి - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
వెల్లుల్లి: 10 రెబ్బలు
నూనె ( నువ్వుల నూనె / వేరుశనగ నూనె) - అర కప్పు
తాజా నిమ్మరసం - 3 నుంచి 4 చెంచాలు

తయారీ విధానం
ముందుగా దొండకాయలను బాగా కడిగి, తడి పూర్తిగా తీసేసి గుడ్డతో తుడవాలి. తొడిమలు తీసి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. ఆవాలను కొద్దిగా వేడి చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.వెడల్పాటి గిన్నెలో కారం, ఆవపిండి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. దాంట్లో నూనె పోసి మరోసారి కలపాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి మసాలా అన్ని ముక్కలకు సమానంగా పట్టేలా కలపాలి.
ఇలా ఊరబెడితే రుచికరమైన దొండకాయ ఆవకాయ
అందులో కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం పిండి మరోసారి బాగా కలపాలి. తడి లేని గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మూత పెట్టాలి. ఒక రోజు ఉంచితే బాగా ఊరిపోయి రంగు, మంచి వాసన వస్తాయి. అవసరమైతే ఉప్పు లేదా నూనె కొంచెం వేసి సరిచేసుకోవచ్చు.
వేడి అన్నంలో నెయ్యితో సూపర్ టేస్టీ
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో కలిపి తింటే ఇది చాలా బాగుంటుంది. క్రంచీ దొండకాయ ముక్కలు నోరూరిస్తాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచితే చాలా కాలం తాజాగా ఉంటుంది. ఇలా చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో ఆవకాయను తయారు చేసుకోవచ్చు. సరిగ్గా చేస్తే నెలల తరబడి ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం దొండకాయ ఆవకాయ ఒక్కసారి ఇలా చేసి ట్రై చెయ్యండి.













Click it and Unblock the Notifications
