కుల్గామ్ లో ఉగ్రదాడి.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతా బలగాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలోని కెల్లమ్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు కార్మికులపై ఉగ్రమూకలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఛత్తీస్ గఢ్ కు చెందిన వారు కాగా గాయపడిన వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారుగా అధికారులు గుర్తించారు.
గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ కార్మికుడిని సమీప ఆస్పత్రిలో చేర్పించామని ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుడు దీపక్ గా.. గాయపడ్డ వ్యక్తిని భూపేంద్ర గా పోలీసులు తేల్చారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. 10 రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు చేపట్టిన రెండో ఎటాక్ ఇది కావడం ఆందోళన కలిగిస్తోంది. గతవారం అనంత్ నాగ్ లో ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ పోలీస్ అధికారి మృతి చెందారు.
ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దాదాపు 3 వేల మందికి పైగా అనుమానితులను నిర్బంధించారు. అయితే ఒకేసారి ఇంతమందిని నిర్బంధించడం పరిస్థితిని మరింత దిగజార్చడమే అవుతుందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పాకిస్థాన్ ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయినా కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.













Click it and Unblock the Notifications