పాదయాత్రను 'సైలెంట్' గా ముగించేసిన అమరావతి రైతులు?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణమే తమ ధ్యేయమని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు అసెంబ్లీ టు అరసవల్లి పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆంక్షల నడుమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఈ యాత్ర నిలిచిపోయింది.

మధ్యలో ఆపివేయడం మంచిది కాదని..
అరసవల్లి సూర్యభగవానుడికి మొక్కుకొని యాత్ర ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపివేయడం మంచిది కాదనే ఉద్దేశంతో గద్దే తిరుపతిరావు ఒక్కరే ఈనెల 11వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం అరసవల్లి చేరారు. సూర్యనారాయణస్వామిని దర్శించుకొని రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలంటూ కోరుకున్నారు. దారిపొడవునా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతిరావుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చామని, అమరావతిని రాజధానిగా చేసి దానిపై వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక అని, ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ, ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానులను మారుస్తారా? అని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు జనగ్ అమరావతే రాజధాని అన్నారు..
2019 ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని జగన్ ప్రకటించలేదా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా ఉంటుంది కాబట్టే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో పౌర సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తిరుపతిరావు ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన అన్నదాతలు మూడున్నర సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని భారీ కార్యక్రమాలను నిర్వహించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 45 రోజులపాటు అలిపిరి వరకు పాదయాత్ర పూర్తిచేశారు. రాష్ట్రమంతటా పాదయాత్ర నిర్వహించి అమరావతికి మద్దతును కోరాలన్నదే రైతుల ఆలోచన.

అరసవల్లి చేరుకున్న తిరుపతిరావు
అలాగే రెండో విడత పాదయాత్రను అసెంబ్లీ టు అరసవల్లి పేరుతో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయింది. యాత్రకు సంఘీభావం ప్రకటించేవారు రోడ్డుకు ఇరువైపులా నిలబడాలని, యాత్రలో కలవకూడదని, ప్రతిరోజు ఎంతమంది యాత్రలో పాల్గొంటున్నారో అంతమంది మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు నిబంధనలు పాటించాలని కోరారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రామచంద్రాపురంలో యాత్ర నిలిచిపోయింది. అక్కడి నుంచి అమరావతి పరిరక్షణ సమితి కో కన్వీనర్ గద్దే తిరుపతిరావు ఒక్కరే పాదయాత్ర చేస్తూ సూర్యభగవానుడి చెంతకు చేరి రైతులందరి తరఫున యాత్రను ముగించారు.












Click it and Unblock the Notifications