అమరావతికి వస్తున్నాం: ఎన్నారైలు, 3మార్గాల్లో పిలుపు, 2లక్షలమంది రావొచ్చు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకకు పలువురు ప్రవాసాంధ్రులు హాజరు కానున్నారు. టిడిపి కువైట్ అధ్యక్షులు సుధాకర్ రావు ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నవ్యాంధ్ర అమరావతి శంకుస్థాపనకు ప్రముఖ ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా హాజరు కానున్నారని చెప్పారు.
ఎంతోమంది అతిరథ మహారథులు పాల్గొంటున్న మహోత్సవానికి టిడిపి ఎన్నారై యూరప్ అధ్యక్షులు, యూకె తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు గుంటుపల్లి జయకుమార్‌తో పాటు తాను (టిడిపి కువైట్ అధ్యక్షుడు సుధాకర రావు) వస్తున్నట్లు చెప్పారు.

అమరావతి వేడుకకు లక్షలమంది
అమరావతి వేడుకకు హాజరు కావాలని ప్రముఖులకు, రైతులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపిస్తోంది. ముఖ్యంగా మూడు విధాలుగా ఆహ్వానాలను పంపిస్తోంది. పత్రికలు, ఈ-మెయిల్స్, ఫోన్ల ద్వారా వారికి ఆహ్వానాలు వెళ్తున్నాయి.
శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి వేర్వేరు చోట్ల బసలు ఏర్పాటు చేయనుంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వేర్వేరు ప్రాంతాల్లో బస ఏర్పాటు చేస్తున్నట్లు ఆహ్వాన కమిటీకి చైర్మన్‌గా ఉన్న కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా ఈ ఆహ్వానాలను పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నామని తెలిపిన ప్రముఖులకు పాస్‌లు, రోడ్ మ్యాప్‌లు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు ఇరవై వేల ఈ మెయిల్స్ ఆహ్వానాలు పంపామన్నారు.
ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు కొంతమంది ఎన్నారైలకు ఈ-మెయిల్స్ పంపామన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మొదలైన వారందరినీ కలిపి సుమారు లక్ష వరకు ఆహ్వానాలు పంపామన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను కూడా ఆహ్వానించామన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలతో సహా రెండు లక్షలమంది వచ్చే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications