వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై - ఏం కోరారు, జగన్ ఏం చెప్పారు..!!
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరిన రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన చేసారు. అంబటి రాయుడుకు గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి సీటు ఇవ్వనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, అంబటి నర్సరావు పేట సీటు కోరుకున్నట్లు సమాచారం. కానీ, ఆ సీటు ఇవ్వటం లేదని తెలియటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాయుడు కీలక ప్రకటన : అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ కు దాదాపు శుభం కార్డు వేసారు. 2023 ఐపీఎల్ లో చెన్నై టీం నుంచి ఆడుతున్న సమయంలోనే పలు సందర్భాల్లో రాయుడు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ కార్యక్రమాలను ప్రశంసించారు. పలు చర్చల్లోనూ జగన్ ను ఎందుకు అభిమానించిందీ వివరించారు. తనకు క్రికెట్ లో ధోనీ గాడ్ ఫాదర్..రాజకీయాల్లో జగన్ గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. 2023 ఐపీఎల్ గెలిచిన తరువాత చెన్నై టీం యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత రాయుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయినట్లుగా వ్యవహరించారు.

వైసీపీకి గుడ్ బై : కొద్ది రోజుల క్రితం అంబటి రాయుడు అధికారికంగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో..గుంటూరు ఎంపీ సీటు రాయుడుకు ఖాయమనే ప్రచారం పార్టీలో వినిపించింది. రాయుడిని గుంటూరు లేదా నర్సరావు పేట నుంచి బరిలోకి దింపే విధంగా పార్టీలో ఆలోచన జరిగింది. తాజాగా సర్వే నివేదికల్లో రాయుడకు అనుకూలంగా లేకపోవటంతో సీటు పైన హామీ దక్కలేదని తెలుస్తోంది. అభ్యర్దుల ఖరారు కసరత్తులో భాగంగా నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ క్రిష్ణదేవరాయులను గుంటూరుకు పంపి..అక్కడ అంబటి రాయుడును దింపే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది. కానీ, తాజా కూర్పులో ఇది కూడా సాధ్యం అయ్యేలా కనిపించ లేదు. దీంతో తనకు సీటు రాదనే నిర్ణయానికి రాయుడు వచ్చారు.
This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.
— ATR (@RayuduAmbati) January 6, 2024
Thank You.
సీటుపై దక్కని హామీ : సీటు లేదని తేలటంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అయితే, క్రికెటర్ గా రాయుడు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఎంత వేగంగా వైసీపీలో చేరారో..అంతే వేగంగా పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత అంబటి రాయుడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు, నర్సరావు పేట ఎంపీల విషయంలో సీఎం జగన్ స్థానిక సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులను ఖరారు చేసారు. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త అభ్యర్దులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications