రఘువీరాతో భేటీ: కాంగ్రెసులో ఉండలేమని చెప్పిన ఆనం
హైదరాబాద్: పార్టీలో కొనసాగలేమని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డికి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఆనం రాంనారాయణరెడ్డి మంగళవారం హైదరాబాద్ ఇందిరాభవన్‌లో రఘువీరారెడ్డిని కలిశారు. పార్టీ మారడంపై పునరాలోచించాలని ఆనంను రఘువీరా కోరారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ వీడాల్సి వస్తోందని రఘువీరాకు ఆనం వెల్లడించారు.

త్వరలో పార్టీ మారే ఏర్పాట్లలో ఆనం సోదరులు నిమగ్నమైనట్లు చెబుతున్నారు. వీరు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అయితే, వారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెచ్చేందుకు బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీలో ఆనం సోదరులు తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. అయితే, రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత వారి ఆధిపత్యానికి తెర దించడానికి ప్రత్యర్థి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆనం సోదరులు పార్టీ వీడడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications