పవన్.. బాబు ట్రాప్‌లో పడొద్దు: ఆనం, జగన్‌పై ఫైర్
హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రాజకీయంగా వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని పవన్ కళ్యాణ్‌కు సలహా ఇచ్చారు.
గతంలో జయప్రద, బాబుమోహన్ వంటి సినీ ప్రముఖులను చంద్రబాబు రాజకీయంగా వాడుకుని వదిలేశారని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ఈ వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని, చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి సూచించారు.

పవన్ కల్యాణ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆనం అన్నారు. ఏపీ రాజధానికి 500 ఎకరాలు సరిపోతాయని, సింగపూర్‌కు తాకట్టు పెట్టేందుకే చంద్రబాబు వేల ఎకరాల భూ సేకరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, నరేంద్ర మోడీ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారని ఆనం మండిపడ్డారు.
వైయస్ జగన్‌పైనా మండిన ఆనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆనం వివేకానందరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రూ.లక్షకోట్లు తిన్న జగన్ జగజ్జంత్రి అని అన్నారు. ఆయనను జైలు భయం వెంటాడుతోందన్నారు. జైలు కెళితే ఎలా ఉంటుందో జగన్‌కు బాగా తెలుసన్నారు. అందుకే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలిసినా బిజెపిని ఇదేంటని ప్రశ్నించలేకపోతున్నారన్నారు.

నోరు మెదిపితే ఏ కేసు ఎటునుంచి వచ్చి మీదపడుతుందోనని భయంతో వణికిపోతున్నారన్నారు. ఆయనపై ఉన్న 40 కేసుల్లో ఏదో ఒకదాంట్లో శిక్షతప్పదని ఆనం జోస్యం చెప్పారు. జగన్ పార్టీ బిజెపిలో విలీనం కావడంపై అమిత్‌షా, రాజ్‌నాథ్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని, ఇక మిగిలింది అసలైన వ్యక్తితోనేనని ఆనం వివేకానంద రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications