ఒంగోలా?.. నెల్లూరా..?: తేల్చుకోలేకపోతున్న వైసీపీ
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారాయన. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. జోష్‌ను నింపారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్ఆర్సీపీ సత్తాకు అద్దం పట్టింది ఈ సభ.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి లక్షలాది మంది ఈ సభకు తరలివచ్చారు. భీమిలీ మొత్తం జనసంద్రమైంది. జన సమీకరణలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు సక్సెస్ అయ్యారు. దీనికి కొనసాగింపుగా వరుసగా రెండు బహిరంగ సభను ప్లాన్ చేసింది వైఎస్ఆర్సీపీ.
ఈ సారి ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 3వ తేదీన ఏలూరు, 10వ తేదీన అనంతపురంలో సిద్ధం పేరుతో రెండు బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీ నాడే ఏలూరులో బహిరంగ సభను నిర్వహించాలని మొదట భావించినప్పటికీ.. అది వాయిదా పడింది.
ఏలూరు, అనంతపురం తరువాత నాలుగో బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలనే విషయం తర్జనభర్జన పడుతోంది వైసీపీ. నెల్లూరు లేదా ఒంగోలుల్లో నిర్వహించాలని భావిస్తోంది. ఒంగోలు వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కేంద్రంగా ఉండేలా ఒంగోలులో ఈ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంచనా వేస్తోంది. ఏలూరు సభ తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications