వైసీపీ- టీడీపీ: పట్టణ ఓటరు నాడి ఎటు వైపు
Anantapur Urban Assembly round up: అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి అగ్నిపరీక్ష పెట్టబోతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ ఓటుబ్యాంకు కాస్త బలహీనంగా ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇక్కడ గెలిచేదెవరనేది ఆసక్తికరంగా మారింది.
అనంతపురం లోక్‌సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు ఇది. 2,55,682 మంది ఓటర్లు ఉన్నారు. రెడ్డి, బీసీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధిక సంఖ్యలు ఉంటుందీ నియోజకవర్గం పరిధిలో. 2008లో చోటు చేసుకున్న నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఆవిర్భవించిన స్థానం ఇది.

2009లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అనంతపురం అర్బన్‌లో. ఇప్పటివరకు ఒక ఉప ఎన్నిక సహా మొత్తంగా నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండుసార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. కాంగ్రెస్, టీడీపీ ఒక్కోసారి గెలుపు రుచి చూశాయి. ఎన్నికల చరిత్రను బట్టి చూస్తే అనంతపురం అర్బన్.. తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలం లేని నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు.
2009 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా బీ గురునాథరెడ్డి గెలిచారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయనే గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి వీ ప్రభాకర్ చౌదరి చేతిలో గురునాథరెడ్డి పరాజయాన్ని చవి చూశారు.
2019లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లింది అనంతపురం అర్బన్. వైసీపీ తరఫున అనంత వెంకట్రామిరెడ్డి విజయఢంకా మోగించారు. టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరిని 10,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఈ సారి ఈ రెండు పార్టీల తరఫునా వారిద్దరే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. విజయం ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications