ఏపీలో ఎంసెట్ మే 10న, కాకినాడ జేఎన్‌టీయూకు
హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడిగానే ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీలో మే 10న ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
బుధవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ ఎంసెట్‌ను సొంతంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంసెట్ నిర్వహణను కాకినాడ జేఎన్‌టీయూకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 1.65 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతారని వివరించారు.
ఎంసెట్ కన్వీనర్‌గా కాకినాడ జేఎన్టీయూ వీసీ ఉంటారని వెల్లడించారు. 1.16లక్షల సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయని పేర్కొన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చర్చలు జరిపినా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఎంసెట్‌కు ఒప్పుకోలేదని గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఉమ్మడి ఎంసెట్‌పై చాలా సార్లు గవర్నర్ నరసింహాన్‌తో పాటు తెలంగాణ విద్యాశాఖ మంత్రిని కలిశామన్నారు. ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్నారు. ఎంసెట్‌తో పాటు మిగతా ప్రవేశ పరీక్షల తేదీలను ఆయన ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉన్నా.. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుందని, విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోలేదన్నారు.
ఎంసెట్‌తో పాటు మిగతా ప్రవేశ పరీక్షల తేదీలు:
ఎంసెట్: మే 10
ఈసెట్: మే 14
ఐసెట్ మే 16
పీజీ ఈ సెట్: మే 25
ఎడ్ సెట్: మే 28
లాసెట్ - పీజీ సెట్: మే 30












Click it and Unblock the Notifications