కుటుంబానికి రూ.3వేలు అందించనున్న చంద్రబాబు ప్రభుత్వం
ఏపీలో దాదాపు మూడు వారాల నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి మాత్రమే సూర్యుడు కనిపిస్తున్నాడంటే రాష్ట్రం మొత్తం ఏవిధంగా ముసురుకుందో అర్థం చేసుకోవచ్చు. గోదావరిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరుతోంది. జూరాల నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు, సంకేశుల నుంచి 1.40 లక్షల క్యూసెక్కులనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈనెల 30వ తేదీన శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాధితులకు రూ.3వేలు
వర్షాలను, వరదను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని, జిల్లా మంత్రులు వెంటనే వారిని పరామర్శించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఒక్కింటికి రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, పంట నష్టం వివరాలను అధికారులు వెంటనే నమోదు చేయాలన్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లుతోందన్నారు.

జోరుగా కురుస్తున్న వానలు
ఏపీ, తెలంగాణలో జోరుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఏపీలో మరో రెండురోజులపాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడగా, ఆగస్టు మొదటివారంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఒడిసా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications