మహిళలకు చంద్రబాబు శుభవార్త... సున్నా వడ్డీతో రుణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా నారా చంద్రబాబునాయుడు ఈసారి తన పాలనతో అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూడా చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను రూపొందించేవారు. తాజాగా అమరావతి సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు అందజేయడంపై ప్రధానంగా చర్చించారు.
ఏడాదికి రూ.5వేల కోట్లు అవుతుందని మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిందని సెర్ప్, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించి రుణాలు పొందారన్నారు. ఎన్నికలకు ముందు సమయంలో పిఠాపురంలో ఈ తరహాలో రూ.7కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటివి మరెక్కడైనా జరిగాయా? అనే విషయంపై జిల్లాలవారీగా విచారణ చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటవుతున్న డ్వాక్రా సంఘాలకు డిజిటల్ ఐడీని రూపొందించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.

అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు చంద్రబాబునాయుడు అంగీకారం తెలిపారు. గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి ఎకరం స్థలాన్ని లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌లో డ్వాక్రా ఉత్పత్తులను విక్రయించబోతున్నారు. ఎన్ఎల్ఆర్ఎం పథకం కింద రూ.41 కోట్లను విడుదల చేస్తే కేంద్రం తన వాటాగా రూ.512 కోట్లను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన 41 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications