AP Assembly : ఏపీ అసెంబ్లీ రద్దు- గవర్నర్ నోటిఫికేషన్ జారీ..!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. వైసీపీ ప్రభుత్వం స్ధానంలో కొత్తగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో ఓవైపు ప్రభుత్వ ఏర్పాటు చర్యలు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రతీ ఐదేళ్లకోసారి రాష్ట్రంలో అసెంబ్లీ పదవీకాలం ముగియగానే దాన్ని రద్దు చేసి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో అసెంబ్లీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీని ప్రకారం ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించి కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు. దీంతో త్వరలో అసెంబ్లీ తొలి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు వీలుగా గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సచివాలయం చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో గతంలో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరిగేవి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి. మూడో పార్టీ జనసేన తరఫున ఓ ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఆ తర్వాత అధికార వైసీపీలోకి ఫిరాయించారు. ఈసారి మాత్రం నాలుగు పార్టీల సభ్యులు అసెంబ్లీలో దర్శనమివ్వబోతున్నారు. ఇందులో అధికార టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు విపక్ష వైసీపీ సభ్యులు కూడా ఉండబోతున్నారు.












Click it and Unblock the Notifications