శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ..!!
Tirumala: ప్రఖ్యాత పుణక్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వేలాదిమంది శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. ఆదివారం నాడు 68,187 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,559 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

కాగా- తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదాలను అందించాలని కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లోఅన్నప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలని అన్నారు.
టీటీడీ ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించాలని, వారిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన ఆలయాలకు వేదపారాయణదారులు, ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై ఆరా తీయాలని, ప్రతి ఆలయంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ ను రూపొందించాలని అన్నారు. ఈ పనులన్నీ కూడా వచ్చే సమావేశానికి పూర్తి చేయాలని చెప్పారు.
టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టీటీడీలోని అర్భన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్ట పర్చడానికి వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. శ్రీనివాస కల్యాణ కార్యక్రమాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ తయారు చేయాలని చెప్పారు.
భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వల్ల ఎక్కువమంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు. అమరావతి వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాల్లో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications