Vande Bharat : విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే..
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల హవా అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాణికులు కూడా ఈ కొత్త రకం రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రతీ వందే భారత్ సర్వీసులోనూ టికెట్లు అస్సలు ఖాళీ ఉండటం లేదు. దీంతో పాటు తమ ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్ లోనూ వందే భారత్ రైళ్లకు స్టాపులు ఇవ్వాలనే డిమాండ్లు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే స్ధానికంగా ఉన్న ఎంపీలు ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న ఓ వందే భారత్ సర్వీసుకు కొత్త స్టాప్ ను జత చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ ప్రయాణించే వందే భారత్ సర్వీసుకు ఇప్పటికే ఉన్న స్టాపులకు తోడు సామర్లకోట రైల్వే స్టేషన్ లోనూ స్టాప్ ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీ, విజ్ఞప్తుల మేరకు సామర్ల కోట లోనూ ఇకపై ఈ సర్వీసు ఆగుతుందని ఇవాళ అధికారులు ప్రకటించారు.

రేపటి నుంచి విశాఖ నుంచి సికింద్రాబాద్ కు, అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రయాణించే రెండు వందే భారత్ సర్వీసులకూ సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్టాప్ కల్పిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే సామర్లకోటలో ఈ అప్ అండ్ డౌన్ రైళ్లు ఎప్పుడు వస్తాయి, ఆగుతాయన్న దానిపైనా సమయాల్ని కూడా ప్రకటించింది. దీని ప్రకారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు సామర్ల కోట స్టేషన్ కు ఉదయం 7.14 నిమిషాలకు చేరుకోనుంది. కేవలం ఒక్క నిమిషం హాల్ట్ తర్వాత తిరిగి 7.15 నిమిషాలకు బయలుదేరిపోనుంది.

అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వందే భారత్ రైలు సామర్ల కోట్ స్టేషన్ కు రాత్రి 9.34 నిమిషాలకు చేరుకోనుంది. అలాగే ఒక్క నిమిషం హాల్ట్ తర్వాత 9.35 నిమిషాలకు తిరిగి బయలుదేరనుంది. ఈ ఒక్క నిమిషం స్టాప్ మినహా ఈ రెండు సర్వీసుల సమయాలు యథావిధిగా ఉండబోతున్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు సామర్ల కోట స్టాప్ కల్పించడం కాకినాడ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications