కుప్పం కౌంటింగ్ పై హైకోర్టు కీలక నిర్ణయాలు-ప్రత్యేకాధికారి నియామకం-వీడియో రికార్డింగ్
టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్మం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోని కుప్పం మున్సిపాలిటీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధుల్ని వైసీపీ సర్కార్ పోలీసుల సాయంతో బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ.. ఇప్పుడు ఎన్నికలు ముగిశాక ఓట్ల లెక్కింపులోనూ గిమ్మిక్కులు చేసే అవకాశం ఉందంటూ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.
కుప్పం ఎన్నికల కౌంటింగ్ పై టీడీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ఇరువైపులా వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించింది. కుప్పం మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో రేపు జరిగే కౌంటింగ్ ను పరిశీలించేందుకు ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే టీడీపీ కోరినట్లుగా కుప్పంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని కూడా ఆదేశాలు హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. కుప్పంతో పాటు నిన్న పోలింగ్ జరిగిన పలు స్ధానాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇప్పటికే కుప్పం మున్సిపాలిటిని వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. దీంతో మంత్రి పెద్దిరెడ్డిని అక్కడే ఉంచి ఎన్నికలను నడిపిస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ నేతల్ని అధికారులు, పోలీసులు టార్గెట్ చేస్తుండటంతో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో హైకోర్టు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తోంది. అలాగే రేపు కుప్పంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకూ వైసీపీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అధికారులపైనా ఒత్తిడి ఉంది. వారు అధికార పార్టీ చెప్పినట్టుగా వింటూ టీడీపీ అభ్యర్ధుల్ని ఇబ్బందిపెడుతున్నారని ముందునుంచీ ఆరోపణలు ఉన్నాయి. దీంతో కౌంటింగ్ వేళ ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు ఆదేశాలతో అయినా వైసీపీ, టీడీపీ రచ్చకు తెరపడుతుందేమో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications