ఇక ఫాస్టాగ్ కు బదులుగా..!!
ఫాస్టాగ్ పై జాతీయ రహదారుల సంస్థ తాజా ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లోకల్ నెలవారీ పాస్, వార్షిక పాస్ ల లభ్యత, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రదర్శించాలని సూచించింది. ఫాస్టాగ్ పాసుల విషయంలో వాహనదారులకు అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల పారదర్శకంగా వాటిని జారీ చేసినట్టవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఫీల్డ్ కార్యాలయాలన్నింటికీ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా మరో ప్రయోగం చేయనుంది ఎన్‌హెచ్‌ఏఐ. ఫాస్టాగ్ కు ప్రత్యామ్నాయంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ప్రవేశపెట్టనుంది. చెన్నై - బెంగళూరు, తాంబరం - విల్లుపురం జాతీయ రహదారి జీఎస్టీ రోడ్ పై పైలెట్ ప్రాజెక్ట్ కింద దీన్ని అమలులోకి తీసుకుని రానుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఇక ఆగనక్కర్లేదు. ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. టోల్ ఛార్జీ వసూలు కోసం కొంతసేపైనా ఆగాల్సి వస్తోంది. ఫాస్టాగ్ నుంచి అమౌంట్ కట్ కావడానికి కొంత సమయం పడుతోంది.

దీన్ని నివారించడానికి ఏఎన్పీఆర్ కెమెరాలను అందుబాటులోకి తీసుకుని రానుంది. జీఎస్టీ రోడ్ గుండా చెన్నై నుంచి చెంగల్పట్టు వైపు ప్రయాణించే వాహనదారులు ఇకపై టోల్ ప్లాజాల వద్ద సుదీర్ఘ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్‌తో లింక్ అయిన ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా టోల్ వసూలు చేస్తారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాలను తొలగించే అవకాశం ఉంది.
ఈ అధునాతన కెమెరాలు గంటకు 100-150 కి.మీ. వేగంతో కదులుతున్న వాహనాల వివరాలను కూడా ఖచ్చితంగా నమోదు చేయగలవు. అలాగే- 40 మీటర్ల దూరం వరకు వీడియో ఫుటేజీని రికార్డు చేస్తాయి. సర్వీస్ లేన్లను కూడా కవర్ చేయడానికి తగినన్ని కెమెరాలు అమర్చుతారు. దీనివల్ల ప్రయాణికులు ఎటువంటి అడ్డంకులు లేకుండా, ట్రాఫిక్ రహిత ప్రయాణాన్ని వాహనదారులకు సాగించినట్టవుతుంది. ఎన్ హెచ్ఏఐ, మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో యూజర్ ఫీజు వసూలు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిలోని నెమిలి (శ్రీపెరంబుదూర్), చెన్నసముద్రం టోల్ ప్లాజా, అలాగే తాంబరం - విల్లుపురం జాతీయ రహదారిలోని పరనూర్ టోల్ ప్లాజా వద్ద ఈ MLFF వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ రెండు రహదారులపై రోజుకు 75,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ కొత్త వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత టోల్ ప్లాజాలు తొలగిస్తారు. వాటి స్థానంలో ANPR కెమెరాలను అమర్చుతారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఇవి రికార్డు చేస్తాయి. సంబంధిత ఫాస్టాగ్ నుండి టోల్ ఫీజును కట్ చేస్తారు.












Click it and Unblock the Notifications