ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఖరారు: కీలక తేదీలు ఇవే
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఆరంభం కానున్నాయి. రెండు వారాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇందులో మూడు రాజధానులను ఏర్పాటుచేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. సమావేశాల ఆరంభానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమౌతుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదిస్తుంది.

7 నుంచి..
మార్చి 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. ఐటీ, పెట్టుబడులు, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి సభ సంతాపం తెలుపుతుంది. ఆయన చేసిన సేవలకు నివాళిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, సభ్యులు ప్రసంగిస్తారు.

11 తేదీన బడ్జెట్..
ఇక 11వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్- వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. వార్షిక బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం 2.40 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్నందున విద్యారంగానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు..
నాడు-నేడు కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తోంది ప్రభుత్వం. దశలవారీగా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సైతం మౌలిక సదుపాయాలను సమకూర్చుతోంది. ఇదివరకు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించింది. ఇంకా పలు పాఠశాలలు మిగిలి ఉన్నందున మరోసారి అదే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఉండొచ్చని చెబుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన తరహాలోనే ఆసుపత్రులన్నింటికీ మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను భారీగా కేటాయిస్తుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. పాఠశాలలకు సమాంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాల్సి ఉన్నందున- దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. రైతు భరోసా పథకం, ఉచిత బోర్లు.. వంటి పథకాలు అమలులో ఉన్నందున వ్యవసాయ రంగానికీ నిధులను మంజూరు చేయడంలో వెనుకాడకపోవచ్చు ప్రభుత్వం.

ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. దీనికి అసవరమైన ప్రక్రియను అధికారులు ఇదివరకే చేపట్టారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే.. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ జగన్ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది. కొత్త జిల్లాలను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో- ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంలో మరికొంత జాప్యం చోటు చేసుకుంటుందనే వాదనలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications