జనవరి 22న ఏపీలో స్కూళ్లకు సెలవు ఇవ్వండి..! పురందేశ్వరి డిమాండ్..!
ఏపీలో పాఠశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవుల్ని మూడు రోజుల పాటు పొడిగించింది. గతంలో ఇచ్చిన సంక్రాంతి సెలవుల్ని పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నెల 21న సెలవు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా జనవరి 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చినా ఏపీలో మాత్రం ఇవ్వకపోవడం వివాదం రేపుతోంది.
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్ట రోజు చాలా రాష్ట్రాలు సెలవు దినంగా ప్రకటించాయి. కానీ ఏపీలో మాత్రం పాఠశాలలకు సెలవు ఇవ్వకపోవడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. జనవరి 22న అయోధ్యలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుందని, రామమందిర ప్రారంభం అనేది భారతీయుల శతాబ్దాల కల అని పురందేశ్వరి పేర్కొన్నారు. అలాంటి ఘట్టాన్ని వీక్షించేందుకు విద్యార్దులకు సెలవు ప్రకటించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.

జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాలు సెలవు ప్రకటించినా ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జనవరి 21 వరకే సెలవులు ఇచ్చారని పురందేశ్వరి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం జనవరి 21న సెలవు ఇవ్వడాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ జనవరి 22న బాల రాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షణ కోసం సెలవు ఇవ్వకపోవడం వెనుక జగన్ సర్కార్ దురుద్దేశం ఉందని పురందేశ్వరి విమర్శించారు. 22న కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications