7గం.ల భేటీ: ఎపిని అగ్రస్థానంలో ఇలా నిలబెడ్తాం.. బాబు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన తొలి కేబినెట్ సమావేశం గురువారం దాదాపు ఏడున్నర గంటల పాటు సాగింది. అనంతరం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక వనరులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 14 కార్పోరేషన్లను స్మార్ట్ సిటీలు నిర్మిస్తామన్నారు.
తాము అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని చెప్పారు. విశాఖ దేశంలోనే ఓ మంచి నగరమన్నారు. విశాఖను మెగా సిటీగా చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ఎప్పుడు టీడీపీకి కంచుకోట అన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా మంచి నీటిని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎపి ఆర్థిక లోటు రూ.15,900 కోట్లు అని చెప్పారు. అన్ని ప్రాంతాలకు తమ ప్రభుత్వం సమన్యాయం ఇస్తుందన్నారు. విశాఖకు మెట్రో రైల్ రావాలన్నారు.

విభజనలో కాంగ్రెసు పార్టీ దుర్మార్గ తీరుతో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. విశాఖలో మొదటి కేబినెట్ సమావేశం జరగడం చారిత్రక విషయమన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిపై చర్చ జరిగిందన్నారు. పట్టణాలు, గ్రామాల్లో రూ.2కే ఇరవై లీటర్ల మంచినీటిని ఇస్తామన్నారు. బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. చెక్ డ్యాంలు నిర్మిస్తామని, భూగర్భ జలాలు పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి నీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. వాతావరణ పరిరక్షణ కింద చెట్లు పెంచడం, పర్యావరణ రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో మార్పులు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ వారు ఇక్కడ, ఇక్కడి వారు తెలంగాణలో పని చేస్తున్నారని, ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న వారు ఇక్కడకు వచ్చినా వారికి ఉద్యోగ వయోపరిమితిని పెంచుతామని చెప్పారు. అక్టోబర్ 2 నుండి పింఛన్లు ఇస్తామన్నారు.
అందరికీ ఉద్యోగాలు కల్పించే విషయమై దృష్టి సారిస్తామన్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది తన హామీ అన్నారు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముందుకు వెళ్తామని చెప్పారు. విభజన సమయంలో ఎపికి ఏం చేస్తామో స్పష్టంగా కాంగ్రెసు పార్టీ నాడు చెప్పలేదన్నారు. విశాఖ నుండి కాకినాడ వరకు బ్రహ్మాండమైన పెట్రో కెమికల్ కారిడార్ వచ్చే అవకాశముందన్నారు. ఎపికి గ్యాస్ ఆధారిత పరిశ్రమలు వచ్చే అవకాశముందన్నారు. తమిళనాడు, కేరళ ఎక్సైజ్ పాలసీలను అధ్యయనం చేస్తామన్నారు.
రాయలసీమలో విండ్ పవర్ వచ్చే అవకాశముందన్నారు. సోలార్ పవర్ కూడా వస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం లోటు బడ్జెట్‌లో ఉన్న ఎపిని సర్ ప్లస్‌లోకి తీసుకొస్తామని చెప్పారు. పదేళ్ల కాంగ్రెసు పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కాంగ్రెసు పాలన వల్ల ఇరవై ఏళ్లు వెనక్కి పోయామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియపర్చాల్సి ఉందని చెప్పారు.
కాంగ్రెసు నేతలు స్వార్థంతో పని చేసినందు వల్ల రాష్ట్రం ఎంత, ఎలా నష్టపోయిందో ప్రజలకు చెప్పాల్సి ఉందన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థ, పరిశ్రమలు ఎలా దెబ్బతిన్నాయో ప్రజలను ఆలోచింప చేస్తామన్నారు. ఎపికి నాటి కేంద్రం అన్యాయం చేసిందని, తమకు న్యాయం చేయాలన్నారు. అలా అని తెలంగాణకు అన్యాయం చేయవద్దని, వాళ్లు కూడా తెలుగువాళ్లే అన్నారు. ఎపికి స్పెషల్ స్టేటస్ ఐదేళ్లే ఇచ్చారని, కానీ పదేళ్లు కావాలన్నారు. అలాగే స్పెషల్ ప్యాకేజీ కూడా ఇవ్వాలన్నారు.
విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చుతామన్నారు. కొత్త రాజధాని కోసం నాలుగు లక్షల కోట్ల నుండి ఐదు లక్షల కోట్ల వరకు అవసరమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి వల్ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయన్నారు. రైతు బజార్లను మళ్లీ పునరుద్ధరించాల్సి ఉందన్నారు. ధరల పెరుగుదల పైన ఓ కమిటీ వేయాల్సి ఉందన్నారు. పరిశ్రమలకు, ఇళ్లకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుండి తీసుకొని అయినా విద్యుత్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అవినీతి పైన తాము పదేళ్లుగా పోరాడుతున్నామని చెప్పారు. ఎపికి బుందేల్ ఖండ్‌లా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications