AP Elections : ఏపీలో ఓటర్ల జాబితాలపై ఈసీ తాజా డెడ్ లైన్స్ ఇవే..!
సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. ఇవాళ విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు పలు సూచనలు చేశారు.
పెండింగ్ లో ఉన్న ఇంటింటి సర్వే, జంక్ క్యారెక్టర్స్ ను సవరించి పరిష్కరించే వాటికి సంబంధించి కొన్ని జిల్లాలో ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీనా ఆదేశించారు. గతేడాది జనవరి 22 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ తొలగించిన అన్ని ఓట్ల రీవెరిఫికేషన్ ఈ నెల 7వ తేదీ కల్లా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు సంబంధించిన పనులు కూడా పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు.

సెప్టెంబర్ 15 వ తేదీన విజయవాడలో ఎన్నికల సంఘం FLC వర్క్‌షాప్ నిర్వహిస్తుందని, అందుకు గాను కలెక్టర్ ఒక సీనియర్ అధికారిని FLC సూపర్‌వైజర్‌గా నియమించడంతో పాటు ఈ భేటీకి కలెక్టర్లు, FLC సూపర్‌వైజర్‌లు తప్పకుండా హాజరవ్వాలన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను అప్‌లోడ్ చేయడంలోనూ, ప్రతివారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశాల మినిట్స్ అప్లోడ్ చేయడంలో పురోగతి సాధిస్తున్నారని తెలిపారు.
దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికల హడావిడి సాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ మేరకు ఓటర్ల జాబితాల సవరణతో పాటు ఫిర్యాదులు వచ్చిన ఓట్ల తొలగింపు వ్యవహారంలోనూ ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లోపు ఈ ప్రక్రియల్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. తద్వారా ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఓటర్ల జాబితాల్ని అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications