ప్రముఖ నిర్మాతకు పిలిచి పదవి ఇచ్చిన సీఎం విజయ్: చేతులు కాల్చుకుంటున్నాడా?
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా అత్యంత కీలకమైన పదవిలోకి ఓ ప్రముఖ నిర్మాతను తీసుకువచ్చింది. ప్రభుత్వపరంగా కీలక బాధ్యతలను అప్పగించింది. కేవీఎన్ గ్రూప్ ఛైర్మన్, సినీ నిర్మాత కే వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.
ఈ పదవికి ఒక రాజకీయేతర వ్యక్తిని, అందునా ఒక ప్రైవేట్ సంస్థ అధిపతిని ఎంపిక చేయడం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెంకట నారాయణ స్థాపించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థే విజయ్ చివరి చిత్రం జననాయగన్ ను నిర్మించింది. ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ వివాదాల కారణంగా ఇంకా విడుదల కాకుండా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గతంలో ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓగా పనిచేసిన వెంకట నారాయణ 2020లో కేవీఎన్ సంస్థను స్థాపించారు.

కన్నడ రాక్ స్టార్ యాష్, మెగాస్టార్ చిరంజీవి, అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటుల చిత్రాలను ఈ సంస్థ పంపిణీ చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. సాధారణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దేశ రాజధానిలో పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక ఐఏఎస్ అధికారిని రెసిడెంట్ కమిషనర్ హోదాలో నియమిస్తుంది. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం, కేంద్ర ప్రాజెక్టుల సాధన, ఆర్థిక వనరుల సమీకరణ కోసం ప్రత్యేక ప్రతినిధులను కూడా ఢిల్లీలో నియమిస్తాయి.
తమిళనాడులో గత రెండు దశాబ్దాలలో కే సెల్వేంద్రన్, ఏ అశోకన్, ఎన్ థలవాయి సుందరం, ఏకేఎస్ విజయన్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు ఈ కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు దీనికి భిన్నంగా సినీ నిర్మాత, వ్యాపారవేత్త వెంకట నారాయణ నియమించడం చర్చనీయాంశమైంది.
వెంకట నారాయణను ఈ పదవిలో నియమించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య మేకేదాటు జల వివాదం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, కర్ణాటకతో బలమైన సంబంధాలు ఉన్న వ్యక్తిని తమిళనాడు ప్రతినిధిగా శాసన రాజధానిలో నియమించడం రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు. అటు ఏఐఏడీఎంకే కూడా ఈ నియామకాన్ని తప్పుపట్టింది. ముఖ్యమంత్రి విజయ్ నటిస్తున్న సినిమాను నిర్మించడమే ఈ అత్యున్నత పదవికి అర్హతగా నిర్ణయించినట్టుందని విమర్శించింది.
కర్ణాటకకు చెందిన వ్యక్తికి తమిళనాడు ప్రయోజనాలను కాపాడే బాధ్యతను అప్పగించడం ఆందోళనకరమని పేర్కొంది. నియామకాల విషయంలో టీవీకే ప్రభుత్వం వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసినప్పుడు కూడా వెంకట నారాయణ ఆయనతో కలసి వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. అంతకుముందు ఓఎస్‌డీగా రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రతిపక్షాల ఒత్తిడితో ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications