విద్యుత్ సరఫరా నష్టాన్ని తగ్గించండి: ఏపీ సీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆర్ధిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల అంశంపై సమావేశంలో చర్చించారు.
రైతుల రుణమాఫీకి సహకరించాలని చంద్రబాబు అధికారులను కోరారు. వాణిజ్య, ఇతర పన్నుల వసూళ్లపై సమగ్రంగా చర్చించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విద్యుత్ సరఫరా నష్టాన్ని ఆరు శాతానికి తగ్గించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చైనా, అమెరికా, జపాన్ స్ధాయికి సరఫరా నష్టం తగ్గించాలని సూచించారు. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై అధికారులతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.
గత అర్ధరాత్రి నుంచి ఏపీ కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఉద్యోగులు సమ్మె విరమించాలని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ కోరారు. ఈనెల 23న జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications