రూ.వేల కోట్లు ఇవ్వండి: ఢిల్లీలో బాబు 'ప్రత్యేక' వేట, ఇదీ ఏపీ పరిస్థితి.. మోడీతో భేటీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఏపీకీ ప్రత్యేక హోదా, ఇతర ఆర్థిక అంశాల పైన చర్చించారు. ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన మధ్యాహ్నం జైట్లీని కలిశారు.
విభజన చట్టం ప్రకారం రాజధానినికి నిధులు ఇవ్వాలని జైట్లీని చంద్రబాబు కోరారు. రెవెన్యూ లోటు నేపథ్యంలో రూ.12,106 కోట్లు, ఐటీ రీజియన్‌కు రూ.7,444 కోట్లు, 7 వెనుకబడిన జిల్లాలకు రూ.200 కోట్లు ఇవ్వాలని కోరారు. పారిశ్రామిక అభివృద్ధికి నాలుగేళ్ల పాటు రూ.1500 కోట్లు ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌లో ప్రత్యేక పద్దుల ద్వారా ఏపీకి నిధులు కేటాయించాలన్నారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహా ఏపీకి కూడా పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరారు. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు ఇవ్వాలని చెప్పారు. అంతకుముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని చంద్రబాబు కలిశారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఎదుట ఆయన పలు ప్రాతిపాదనలు చేశారు. విశాఖ రైల్వేజోన్ పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాంతో పాటు రాజమహేంద్రవరం పాతరైల్వే బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. విజయవాడ - అమరావతి - గుంటూరును కలుపుతూ రైల్వేమార్గం నిర్మించాలని తెలిపారు.

విశాఖ - చెన్నై మధ్య మూడో రైల్వేలైన్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవాలని, కాకినాడ - పిఠాపురం, నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్ల నిర్మాణం, గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్రమంత్రికి విన్నవించారు. ఇతర రైల్వేలైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. విశాఖ - చెన్నై మూడోలైనుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌తో చంద్రబాబు భేటీ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను చంద్రబాబు కలిశారు. ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు పెంచాలని కోరారు. గ్రామీణాభివృద్ధిలో కేటాయించే నిధులు పెంచాలని కోరారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి జెపి నడ్డాతో కామినేని భేటీ
కేంద్రమంత్రి జెపి నడ్డాతో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు మంగళవారం నాడు సమావేశమయ్యారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పైన కేంద్రమంత్రితో చర్చించారు.
ప్రధాని మోడీతో భేటీ
చంద్రబాబు సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పునర్ వ్యవస్థీకరణలో ఇచ్చిన హామీల పైన ఆయన చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడేందుకు ఇవ్వాల్సిన రాయితీలు, నిధులు తదితర అంశాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications