రుషికొండకు మంత్రులు-కేబినెట్లో చంద్రబాబు ఆదేశం-పాస్టర్ మృతిపై..!
ఇవాళ అమరావతి సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రెండు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో విశాఖలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలతో పాటు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి వ్యవహారం ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వం ముందుకెళ్లలేని పరిస్ధితి ఉందన్న ప్రచారం నేపథ్యంలో వీటిపై ఏం చేద్దామని తన మంత్రుల్ని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో ప్రశ్నించారు.
రుషికొండ భవనాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించారు. రుషికొండ భవనాలను ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు మంత్రుల సూచనలు కోరారు. మంత్రులంతా రుషికొండను సందర్శించాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ఓ అభిప్రాయానికి రావాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. ఇప్పటికే ఓసారి తాను స్వయంగా రుషికొండ భవనాలను పరిశీలించినా ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు మంత్రుల్ని కూడా అక్కడికి వెళ్లొచ్చి సలహా ఇవ్వాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే తాజాగా రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇందులో పాస్టర్ మృతిపై చట్టపరంగా విచారణ జరిపినట్లు సీఎం మంత్రులకు వివరణ ఇచ్చారు. సున్నిత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు. లేకుంటే ఎలా వివాదాస్పదం చేస్తారో ఇదొక ఉదాహరణ అంటూ మంత్రులకు గుర్తుచేశారు. తద్వారా పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తు ఇక ముగిసినట్లేనన్న సంకేతాలు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని కేబినెట్ భేటీలో చంద్రబాబు ఆదేశించారు. నెలలో నాలుగు రోజుల పాటు పల్లెనిద్రకు సిద్దం కావాలని వారికి సూచించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో నాలుగో వంతు కూడా ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదని, పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications