ఈనెల 7నే జాబితా విడుదల : జగన్ కేబినెట్ కూర్పు ఇలా..: అసంతృప్తి భగ్గు మంటుందా..!
మంత్రివర్గ ఏర్పాటులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త విధానం అనుసరిస్తున్నారు. మంత్రులుగా ఎవరిని నియమించాలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. అయితే, జగన్ మాత్రం తన టీం గురించి పార్టీ నుండి ఎంపికైన అందరు ఎమ్మెల్యేలకు వివరించి..వారి పేర్లను వారి సమక్షంలోనే ముందుగానే ప్రకటించాలని నిర్ణయించారు. తన కేబినెట్ కూర్పు గురించి వివరించి..వారి ఆమోదంతోనే కేబినెట్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో..8న జరిగే కేబినెట్ ప్రమాణ స్వీకారంలో ఎవరికి అవకాశం దక్కేదీ ముందు రోజే వెల్లడి కానుంది. జగన్ టీంలో సీనియర్లు-జూనియర్లతో కలిసి ఉండగా .. కొందరు సీనియర్లకు పార్టీ పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

7న వైసీపీఎల్పీ సమావేశం..
ఈ నెల ఏడవ తేదీన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంలో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్న ఆర్దిక కష్టాలు..తీర్చాల్సిన హామీలతో పాటుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గురించి జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. అదే సమయంలో ఈ నెల 8న తేదీన జగన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం పేర్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసారు. శాసనసభాపక్ష సమావేశంలో ముందుగా తాను ఎవరిని ఎందుకు కేబిట్‌లోకి తీసుకుంటుందీ వివరించి..వారికి రెండేళ్లు కాలం మంత్రులుగా ఉంటారని..వారి సామర్ధ్యంకు అనుగుణంగా కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేయనున్నారు. అదే సమయంలో ఎవరికైతే మంత్రి పదవులు దక్కలేదో వారికి పార్టీ పరంగా ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

సీనియర్ల- యువత సమతూకం
మొత్తం 25 మంది మంత్రులతో జగన్ కేబినెట్ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే జగన్ తన టీంలో ఎవరు ఉండాలో డిసైడ్ చేసారు. ప్రాంతీయ-సామజిక సమతుల్యంతో పాటుగా సీనియర్లు..జూనియర్ల మమేకంతో తన టీం ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఇందు కోసం బొత్సా..ధర్మాన..పిల్లి సుభాష్ చంద్రబోస్..పార్ధసారధి.. మోపిదేవి.. బాలినేని..ఆనం..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారితో పాటుగా సామాజిక సమీకరణాల్లో ఎస్సీ-ఎస్టీ-మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి పదవులు హామీ ఇచ్చిన వారికి ఛాన్స్ దక్కనుంది. ఎన్నికల్లో ఓడిన మోపిదేవికి మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ కోటాలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఛాన్స్ దక్కనుంది. ఇక, ఆమంచి కృష్ణ మోమన్ విషయంలో జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రకాశం నుండి బాలినేని..ఆదిమూలపు సురేష్‌లకు మంత్రి పదవులు దక్కనున్నాయి.

ఆ సీనియర్లకు పార్టీ పదవులు..అసంతృప్తి తప్పదా..
ఇక, మంత్రులుగా అవకాశం ఇవ్వలేని సీనియర్లకు పార్టీ పదవులు అప్పగించనున్నారు. అందులో అంబటి రాంబాబు , భూమన కరుణాకరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి లాంటి వారికి మంత్రి పదవుల కేటాయింపులో ఇంకా స్పష్టత రాలేదు. వీరికి మంత్రిగా అవకాశం లేకపోతే..పార్టీలో కీలక పదవులు ఇవ్వనున్నారు. ఇక, జగన్ దాదాపుగా ప్రయోగం చేస్తున్నారు. ముందుగానే మంత్రి పదవులు ప్రకటించటం వలన అసంతృప్తులు చెలరేగే అకాశాలు ఉన్నాయి. ఇది జగన్ సమర్ధతకు పరీక్ష. టీడీపీ తరహాలోనే ఇక్కడా పదవులు రాని వారు అసంతృప్తికి గురవుతారా లేక జగన్ కోసం వారంతా అధినేత ఆదేశాలను పాటిస్తారా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications