శాంతిభద్రతలపై సిఎం అసంతృప్తి:ధీటుగా ప్రతిస్పందించిన డిజిపి...నిజమేనా?
అమరావతి:రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సిఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని...అయితే అందుకు పోలీస్ బాస్ అయిన డిజిపి మాలకొండయ్య కూడా ధీటుగానే ప్రతిస్పందించి ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారని రాజధాని ప్రాంతంలో జరుగుతున్న తాజా ప్రచారం.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వార్తలు వెలువరించే ఒక మీడియా సంస్థ ద్వారా ఈ వార్తాకథనం ప్రచారం లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఎంతనేది ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితులు ఈ కథనం నిజమేనేమో అని నమ్మడానికి వీలుగా ఉండటంతో ఈ ప్రచారం బలం పుంజుకోవడానికి కారణమైందని తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే?....

శాంతిభద్రతలు...సిఎం అసంతృప్తి
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచారాలు,హత్యలు,దోపిడీ ఘటనలపై సిఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎపిలో ఈ నేర ఘటనల పరంపరపై కలత చెందిన ముఖ్యమంత్రి డిజిపి మాలకొండయ్యతో అదే విషయం ప్రస్తావించారట. మీరు ఎంతో సమర్థులని పిలిపించానని...కానీ
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే సిఎం చంద్రబాబు స్పందనపై డీజీపీ మాలకొండయ్య కూడా ధీటుగా...ఇంకా చెప్పాలంటే ఘాటుగా ప్రతిస్పందించారని తెలిసింది.

డిజిపి...ఇలా అన్నారట
పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని...ఎమ్మెల్యేలు,మంత్రులు, చివరకు దిగువ స్థాయి పార్టీ నేతలతో సహా పార్టీ నాయకులు పోలీస్ సిబ్బంది మీద వివిధ అంశాల మీద ఒత్తిడి చేస్తుండటంతో పోలీస్ అధికారులు లొంగక తప్పడం లేదని...దానితో పోలీసులు స్వేచ్ఛగా పని చేయలేక పోతున్నారని డిజిపి మాలకొండయ్య సిఎంతో చెప్పారట...మాకు స్వేచ్ఛ ఇచ్చి చూడండి...పోలీస్ తడాఖా అంటే ఏమిటో...ఎట్లా ఉంటుందో చూపిస్తాం అని పోలీస్ బాస్ బదులిచ్చారట. దీంతో సిఎం చంద్రబాబు సైతం డీజీపీ మాలకొండయ్య సమాధానానికి మౌనం వహించారని అంటున్నారు.

అలా అంటారా?...అనే వుంటారు!
అయితే ఈ ప్రచారం పోలీస్ శాఖతో పాటు జనాల్లోనూ చర్చనీయాంశంగా మారింది...ఈ నెలఖరుకు పదవీ విరమణ చేయనున్న డిజిపి మాలకొండయ్య...ఈ సమయంలో సిఎంతో అలా అని ఉంటారా అని కొందరు...అనే ఉంటారని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అయితే అత్యధికులు మాత్రం డిజిపి మాలకొండయ్య సిఎంకు ధీటుగా సమాధానం చెప్పేవుంటారని...అదీ ఈ సందర్భం కాబట్టే ఖచ్చితంగా అలా ప్రతిస్పందించి ఉంటారని విశ్వసిస్తుండటం గమనార్హం. నిజాయితీ కలిగిన నిఖార్సైన అధికారిగా పేరుతెచ్చకున్న మాలకొండయ్య కెరీర్ మొత్తంలో చిన్న మచ్చ కూడా లేకపోవడం కూడా ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు గతంలో మాలకొండయ్య సమర్థతకు అద్దం పట్టే సంఘటనలను ఉదహరిస్తున్నారు.

అప్పట్లో...అలా జరిగింది
గతంలో మాలకొండయ్య ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆస్థానంలో తేజ్ దీప్ ప్రతిహస్థ అనే మరొక ఐపిఎస్ అధికారిని నియమిస్తూ అప్పటి వైయస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందిట. కానీ ఆనాటి ట్రాన్స్ కో ఉన్నతాధికారి రేచల్ చటర్జీ మాత్రం ఈ నియామకానికి ఒప్పుకోలేదట. ట్రాన్స్ కో తో చాలా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీల సంబంధబాంధవ్యాలు ముడిపడివుంటాయి. అధికారిక సమావేశాలలో వాటిపై జరిగే చర్చలు, తీసుకోవలసిన చర్యల సమాచారం...ఇలా వీటి గురించి ఏమాత్రం బయటకు పొక్కినా ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వందల కోట్ల రూపాయల భారం పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మాలకొండయ్య వంటి నిజాయితీ కలిగిన అధికారులు ట్రాన్స్ కోలో కొనసాగడం అవసరం...కాబట్టి ఆయన్ను తాను రిలీవ్ చెయ్యలేనని అని రేచల్ చటర్జీ ఖరాఖండిగా చెప్పారట. మాలకొండయ్య ఉద్యోగ నిబద్దతకు అదొక చిన్న ఉదాహరణ అని ఈ సందర్భంలో కొందరు గుర్తుచేసుకుంటున్నారు.

సిఎం టెన్షన్...దేనికంటే
అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సిఎం కొంత కలత చెందుతున్న మాట వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో తెగతెంపుల నేపథ్యంలో...సెంట్రల్ గవర్నమెంట్,ప్రధాని మోడీ...అమిత్ షాపై టిడిపి ప్రభుత్వం తీవ్ర ఆరోపణల క్రమంలో...తాము ఎక్కడ దొరుకుతామా అని కేంద్రం కాసుకు కూర్చోవడం సర్వసాధారణమని...అలాంటి పరిస్థితుల్లో ఇలా శాంతిభద్రతల క్షీణత అంశం కూడా తమకు ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారట. అంతేకాకుండా ఎన్నికలు అతి సమీపంలోకి వచ్చేస్తున్న తరుణంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం ప్రభావం అనేక రకాలుగా టిడిపి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనేది కూడా చంద్రబాబు ఆందోళన అంటున్నారు. అందుకే శాంతిభద్రతల మెరుగుదలకు ఇకముందు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని...ఈ క్రమంలో డిజిపి మాలకొండయ్య ప్రతిస్పందనను ఫీడ్ బ్యాక్ గా తీసుకొని సిఎం చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!