ప్రజాదర్బార్ వెనక సీఎం జగన్ భారీ వ్యూహం?
వ్యూహ ప్రతివ్యూహాలను రచించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిట్ట. రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన చేతిలో పలు అస్త్రశస్త్రాలున్నాయి. వాటిలో ఏది సంధించినా విజయం సాధించడం సులభమనే నమ్మకంలో వైసీపీ శ్రేణులున్నాయి. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోంది? ''గడప గడపకు మన ప్రభుత్వం''లో ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీయడానికి కారణమేంటి? తదితర అంశాలను ఆయనే స్వయంగా తెలుసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు
''ప్రజాదర్బార్'' ద్వారా ప్రజల సమస్యలను ఆయనే స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించారు. వారి గోడు వినడంద్వారా ఉపశమనం లభిస్తుందని, తద్వారా వారు సంతృప్తులవుతారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లడం.. లేదంటే వారే ముఖ్యమంత్రి దగ్గరకు రావడం అనేది మంచి ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమస్య ముఖ్యమంత్రివద్దకు వెళ్లింది కాబట్టి పరిష్కరించడంలో అధికారులు తాత్సారం చేసే అవకాశం లేదు.

గతంలో రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి
గతంలో ముఖ్యమంత్రే రచ్చబండ ప్రారంభించాలనుకున్నప్పటికీ పలు కారణాలవల్ల వాయిదా పడింది. జిల్లాల పర్యటన కూడా చేద్దామనుకున్నప్పటికీ అదీ వాయిదా పడింది. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలంతా సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వస్తున్నారంటూ ఊరూ వాడా ప్రచారం చేశారు. కానీ అది కూడా అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. ఆ తర్వాత తాను లేకుండా ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రజల మనస్తత్వం అర్థమవుతుందిగా??
ప్రజలు ఎదుర్కొంటోన్న వ్యక్తిగత సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ వాటిని పరిష్కరించే దిశగా ''ప్రజాదర్బార్'' సాగబోతోంది. ఈనెల ఎనిమిదోతేదీనే దీన్ని ప్రారంభించాలనుకున్నప్పటికీ విశాఖ పర్యటన వల్ల వాయిదా పడింది. వారి వ్యక్తిగత సమస్యలను తెలుసుకోవడంద్వారా అసలు రాబోయే ఎన్నికల్లో వారు ఏ పార్టీకి మద్దతివ్వాలనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? అనే విషయాలు కూడా స్పష్టమవుతాయని, దాన్నిబట్టి ఒక నిర్ణయానికి రావచ్చనే అంచనాలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications