YS Sharmila: వైఎస్ షర్మిలకు పీసీసీ ఛీఫ్ పదవి అందుకే ఇవ్వట్లేదా ?
తెలంగాణలో తన సొంత పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి తాను కూడా ఆ పార్టీలో చేరిపోయినా వైఎస్ షర్మిలకు అనుకున్న ఫలితం లభించడం లేదా ? పార్టీలో చేరకముందు అధిష్టానం ఇచ్చిన హామీని ఆ తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తోంది ? అసలు ఉనికే కష్టంగా మారిన ఏపీలో పీసీసీ ఛీఫ్ గా షర్మిలను నియమిస్తే ఏం జరుగుతుంది ? దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారు ? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఆమె అభిమానుల్లో వినిపిస్తున్నాయి.
వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం, వైఎస్ షర్మిల చేరిక తర్వాత వెంటనే ఆమెకు ఏపీసీసీ ఛీఫ్ పదవి ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సరే ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని షర్మిలే బహిరంగంగా చెప్పుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. షర్మిల కాంగ్రెస్ లో చేరి రెండో వారం అవుతున్నా ఇంకా ఆమెకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై అధిష్టానంలో డైలమా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమెకు ఏ హామీ ఇచ్చి పార్టీలోకి తెచ్చారో ఆమెకు దాన్ని ఇచ్చే పరిస్ధితి కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ షర్మిలను ఏపీసీసీ ఛీఫ్ గా నియమిస్తే ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అయితే ఆమె చేరికకు ముందు షర్మిలను ఆహ్వనిస్తాం, ఆమె రాక మంచిదేనంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సీనియర్లు ఇప్పుడు పీసీసీ ఛీఫ్ పదవి దగ్గరికి వచ్చేసరికి ఆమెకు అడ్డుపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. దీనికి పరాకాష్టగా ఇవాళ మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియా ముందుకు వచ్చి షర్మిలకు పీసీసీ ఛీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరవుతుందని తేల్చేశారు. ఆమెకు ఆ పదవి ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లో ఉన్న వైఎస్ షర్మిల.. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న భేటీ తర్వాత కీలక నిర్ణయం వెలువడుతుందని ఆశాభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరగకపోతే ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే షర్మిలకు ఇప్పుడు పీసీసీ ఛీఫ్ పదవి ఇవ్వకపోతే ఆమెను తెచ్చిన ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications