జగన్ హయాం నిర్ణయాలపై నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్..!
ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా విధుల్లో మునిగిపోతున్నారు. గత రెండు రోజులుగా వరుసగా రోజుకు పదేసి గంటల పాటు తనకు అప్పగించిన శాఖలపై సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా పలు అంశాలపై అధికారులతో భేటీ అయ్యారు. అంతే కాదు ఇందులో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చోటు చేసుకున్న అక్రమాలపై పైర్ అయ్యారు.
రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఇవాళ పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ సమీక్షకు మంత్రి నారాయణ, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ధిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహారం చర్చకు వచ్చింది. 15వ ఆర్ధిక సంఘం నిధుల్ని గత ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు మళ్లించిన వ్యవహారంపై పవన్ ఫైర్ అయ్యారు. ఇందులో పాలుపంచుకున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు ఇచ్చేందుకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధుల్ని దారి మళ్లించి సంక్షేమ పథకాలకు వాడుకున్న తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇలా సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎన్ని నిధులు మళ్లించారో తనకు వివరాలు కావాలని కోరారు. దీంతో అప్పట్లో ప్రభుత్వ పెద్దల మాట విని నిబంధనలకు విరుద్ధంగా ఇలా నిధులు మళ్లించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీఎస్ నుంచి నివేదిక వచ్చాక పవన్ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications