వారి ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ - గెలుపు దక్కేదెవరికి..!!
ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలో హోరా హోరీగా తల పడుతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో, పోటీలో ఉన్న అభ్యర్దులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలోని పలు నియోజకవర్గాల్లోని ఓటర్లు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వారితో ఓటర్లు గ్రేటర్ పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వారిని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు
ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హైదరాబాద్ లో స్థిర వారి ఓట్లపై గురిపెట్టారు. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ తమ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. దీనికోసం గ్రేటర్‌లో ప్రత్యేకంగా ఏపీకి చెందిన అభ్యర్థుల టీమ్‌లు పని చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, కుకట్ పల్లి, శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా తమకు సహకరించే వారి మద్దతుతో తమ నియోజకవర్గ ఓటర్లను అభ్యర్దులు కలుస్తున్నారు.

గ్రేటర్ లో సమావేశాలు
ఏపీలోని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు మియాపూర్‌లోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు హాజరై కూటమికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి కూడా నగరంలో నివాసముంటున్న తన నియోజకవర్గ ఓటర్లకు ప్రముఖ హోటల్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు మొత్తం ఏపీ ఓటర్లతో కిటకిటలాడడుతున్నాయి. ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు రాను, పోను బస్ చార్జీలు అందిస్తామని, అవసరమైతే వాహనాలు కూడా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. తమను ఓటేసి గెలిపించాలని అభ్యర్దిస్తున్నారు.
మద్దతు దక్కేలా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారు పెద్దఎత్తున ఉపాధి పొందుతున్నారు. వారిలో చాలావరకు తమ సొంతూర్లలోనే ఓట్లున్నాయి. ఏపీ ఓటర్లను గుర్తించి వారిని ఓటేసేందుకు తీసుకొచ్చే విధంగా అభ్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేకటీమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా టీమ్‌లు నగరంలో ఉంటున్న ఓటర్లను గుర్తించి వారి మొబైల్ నంబర్లు సేకరిస్తున్నారు. తర్వాత ఫోన్‌కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా నగరంలోని కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్స్ హాల్స్, వివిధ హోటళ్లలో సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. హోరా హోరీగా మారుతున్న పోరులో ఈ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా అభ్యర్దులు భావిస్తున్నారు. దీంతో..వీరి మద్దతు ఎన్నికల్లో దక్కే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications