చలో అమరావతి: హైదరాబాద్ సచివాలయాన్ని సర్దేస్తున్న అధికారులు!
హైదరాబాద్/అమరావతి: అక్టోబర్ 3 తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులు, దస్త్రాల తరలింపు ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నుంచి తరలింపు ప్రక్రియను ప్రారంభించాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ నుంచి ఆదేశాలు జారీకాగా, ఉద్యోగులు తమ తమ సరంజామాను ప్యాక్ చేశారు.
తరలింపు సజావుగా సాగేందుకు ఉద్యోగులందరికి నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెలగపూడిలో ఇప్పటికే తాత్కాలిక సచివాలయ భవనాలు సిద్ధం కాగా, ఈ అక్టోబర్ నెలాఖరుకల్లా తరలింపును పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
కాగా, అక్టోబర్ లో 1, 2 తేదీలు సెలవు దినాలు కాగా, 3 నుంచి పూర్తి పరిపాలన వెలగపూడి నుంచే సాగనుంది. ఇదిలావుండగా, సెక్రటేరియట్ లో అతి ముఖ్యమైన విభాగాల్లో ఒకటిగా ఉండే సెంట్రల్ రికార్డ్ రూమ్‌ను మాత్రం హైదరాబాద్ లోనే ఉంచనున్నారు.

ఆదేశాల్లో ఏముంది?
హైదరాబాద్ నుంచి సచివాలయం తరలించే ప్రక్రియను బుధవారం నుంచి తప్పనిసరిగా మొదలుపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అంతర్గత ఉత్తర్వులను అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేశారు.
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలోని భవనాలు కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమయ్యాయనీ, హైదరాబాద్ సచివాలయం నుంచి అక్కడికి తరలి వెళ్లాలని స్పష్టం చేశారు. 30వ తేదీనాటికల్లా వెలగపూడిలో కార్యాలయాల ఏర్పాటు పూర్తి కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications