ఏపీలో కొత్త మద్యం విధానం ప్రకటన-11న 3396 షాపుల వేలం-12 నుంచి అమ్మకాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం సొంతంగా నడిపిన మద్యం షాపుల స్ధానంలో 3396 రిటైల్ మద్యం షాపుల్ని వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించేందుకు కూటమి సర్కార్ సిద్దమైంది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ విధానంలో ఐదు జీవోల్ని జారీ చేసింది.
వీటిలో మద్యం షాపుల వేలం, లైసెన్స్ ఫీజులు, ప్రీమియర్ స్టోర్స్ ఇలా ప్రతీ అంశంపైనా క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో కొత్తగా అమల్లోకి రానున్న ఎక్సైజ్ విధానం ప్రకారం రాష్ట్రంలో మద్యం షాపుల్ని వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రాంతాల్ని జనాభా ఆధారంగా నాలుగు స్లాబుల్లో విభజించి లైసెన్స్ ఫీజులు నిర్ణయించారు. తొలి ఏడాది మాత్రం 10 వేల లోపు జనాభా ఉంటే 50 లక్షల లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 85 లక్షలు చెల్లించాలి. రెండో ఏడాది నుంచి వీటిని 10 శాతం చొప్పున పెంచుతారు. రిటైల్ వ్యాపారం కాబట్టి 20 శాతం మార్జిన్ ఇస్తున్నారు. అలాగే విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురంలో 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేస్తారు.
వీటి కోసం ఇవాళ ఉదయం నుంచే ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఒక్కో అప్లికేషన్ కు రెండు లక్షల నాన్ రిఫండబుల్ మొత్తం చెల్లించాలి. ఇలా 10వతేదీ వరకూ వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి 11న వేలం పాటలు నిర్వహిస్తారు. ఇందులో అత్యధిక మొత్తానికి పాడుకున్న వారికి లైసెన్స్ లు కేటాయిస్తారు. 12 నుంచి కొత్త రిటైల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఆలోపు పాత విధానం ప్రకారం ఉన్న షాపులు కొనసాగుతాయని ప్రభుత్వం జీవోల్లో పేర్కొంది.
ఈసారి 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందించేలా ఎక్సైజ్ పాలసీలో నిబంధన పెట్టారు. అలాగే గీత కార్మికులకు ప్రత్యేక విధానం అమల్లోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండు, మూడు రోజుల్లో ఈ పాలసీ ప్రకటన రానుంది. దీని ప్రకారం ఆరు గీత కులాలకు 340 దుకాణాలు కేటాయించబోతున్నారు. మరోవైపు తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు పెట్టకుండా నిషేధం విధించారు. ఇందులో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకూ పలు ప్రాంతాలున్నాయి.












Click it and Unblock the Notifications