ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ కు అధికారుల షాక్ ! ముగ్గురిపై వేటు-ఎండీ,ఈడీపై సీఐడీ..!
ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో రాజకీయాలు మరింత ముదిరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం నియమించిన 400 మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించిన ఛైర్మన్ జీవీ రెడ్డి.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు. అయితే వారిని తొలగించేందుకు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు అంగీకరించకుండా జీవీరెడ్డి ఆదేశాల్ని పక్కనబెట్టేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇవాళ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన జీవీ రెడ్డి.. తాను బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచీ ఏం జరుగుతుందో కుండబద్దలు కొట్టేశారు.ఏపీ ఫైబర్ నెట్ కు 78 వేల కి.మీ.ఆప్టికల్ కేబుల్ ఉందని, ఫైబర్ నెట్ కు ప్రతీ రోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఐఏఎస్ దినేష్ కుమార్ ఆగస్టులో చార్జ్ తీసుకున్నారని, చార్జ్ తీసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఆయన గత అధికారులతో కుమ్మక్కు అయ్యారా అన్న సందేహం వస్తోందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి రాలేదన్నారు. ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదన్నారు.

దీనికి కారణమైన ముగ్గురు అధికారులకు నోటీస్ పిరియడ్ ఇవ్వాలని నిర్ణయించారు. సత్యరామ భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్( బిజినెస్ హెడ్), శశాంక్ హైదర్ ఖాన్(ప్రొక్యూర్ మెంట్ ఆఫీసర్ ) సేవలు ఫైబర్ నెట్ కు అవసరం లేదని నిర్ణయించి వారిని తొలగిస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు.
గతంలో తొలగించిన వారిని ఇంత వరకు విధుల నుంచి టెర్మినేట్ చేయలేదని, కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు? ఫైబర్ నెట్ లో జీఎస్టీ సమస్య వచ్చిందని, గత నెలలో తమకు రూ.377 కోట్ల జరిమానా విధించారని, ఈ విషయం కూడా తనకు చెప్పలేదన్నారు. ఆయా సమస్యలకు కారణమైన ఎండీ, ఈడీలపై సీఐడీ దర్యాప్తు కోరతానని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications