జగన్-సెకీ డీల్ రద్దు-ఆర్థికమంత్రి పయ్యావుల క్లారిటీ..!
ఏపీలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం భారత సౌర విద్యుత్ కార్పోరేషన్ (సెకీ)తో గతంలో వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న 7 వేల కోట్ల ఒప్పందం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అప్పట్లో అదానీ గ్రూప్ ఒత్తిడితోనే ఎవరూ కొనని ధరకు సౌర విద్యుత్ ను వైసీపీ సర్కార్ కొనుగోలు చేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ డీల్ ను రద్దు చేయాల్సిందేనన్న ఒత్తిడి చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇరుకునపడింది.
అదానీ తో లింక్ అయిన ఈ డీల్ ద్వారా జగన్ కు రూ.1750 కోట్ల ముడుపులు అందినట్లు అమెరికా కోర్టులో ఎఫ్బీఐ అభియోగాలు మోపిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయకుండా చంద్రబాబు సర్కార్ మీనమేషాలు లెక్కించడంపై సొంత పార్టీలో సైతం అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ దీనిపై స్పందించారు. విద్యుత్ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారని, అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వ వైఖరి తెలియజేస్తామని పయ్యావుల తెలిపారు.

మరోవైపు ఇవే ఒప్పందాలపై గతంలో తాను హైకోర్టుకు వెళ్లినట్లు పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. కాబట్టి దీని గురించి తానే ఎక్కువగా మాట్లాడితే బాగుండదన్నారు. ఆర్థిక, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా సీఎం ప్రకటన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ క్లారిటీ ఇచ్చారు. తద్వారా ఆయా ఇబ్బందులపై ప్రభుత్వం ప్రస్తుతం అధ్యయనం చేస్తుందని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే రాయిటర్స్ తో మాట్లాడుతూ పయ్యావుల కేశవ్.. ఈ డీల్ రద్దు చేసే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications