బెంగుళూరు తొక్కిసలాట ఘటనలో ఏపీ బాలిక మృతి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచ వ్యాప్తంగా కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఇక మన దేశంలో అయితే ఐపీఎల్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 18 ఏళ్ల నుంచి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు కన్న కల నెరవేరిన క్షణం.. ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాటలో.. ఇప్పటికే 11 మంది మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
అయితే మృతుల్లో అన్నమయ్య జిల్లాకు చెందిన బాలిక కూడా ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. చిన్నమండెం మండలం వండాడికి చెందిన దివ్యాంశి అనే 14 ఏళ్ల బాలిక తొక్కిసలాటలో చనిపోయింది. దివ్యాంశి తండ్రి శివకుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కలిసి విక్టరీ పరేడ్ చూడడానికి స్టేడియం వద్దకు వెళ్లారు. కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో దివ్యాంశి ఊపిరాడక చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్యాంశి మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ క్రమంలోనే దివ్యాంశి అంత్యక్రియలు ఇవాళ ( 6-06-2025 ) నిర్వహించనున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కాగా మరోవైపు తొక్కిసలాట జరిగిందని తెలిసినప్పటికీ.. విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారని.. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసినా కూడా ఈవెంట్ ని నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ విషాద ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా.. ఆర్సీబీ ప్రతినిధులు, ఈవెంట్ నిర్వహించిన ఏజెన్సీ ప్రతినిధులను అరెస్టు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా తొక్కిసలాటకు గల కారణాలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటక హైకోర్టు సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నివేదికను వచ్చే మంగళవారం లోగా సమర్పించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications