వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదా ? ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇదే..!
ఏపీలో మరోసారి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గబోదని ఓ క్లారిటీ ఇచ్చింది. కార్మిక నేత పాడి త్రినాథ్ రాసిన ఓ లేఖకు స్పందిస్తూ కేంద్ర ఉక్కు మంత్విత్వశాఖ వివరణ ఇచ్చింది. ఇందులో ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ విషయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టత ఇచ్చేసింది. దీంతో మరోసారి కార్మిక సంఘాలు స్వరం పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఇందులో తెలిపింది. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, ఇప్పటికే కేంద్రమంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారని వెల్లడించింది. విశాఖ ఉక్కు పునరుజ్జీనానికి కేంద్రం వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, ఎన్డీఏ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తోందని తెలిపింది.

విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, ఇప్పటికే కేంద్రమంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. విశాఖ ఉక్కు పునరుజ్జీనానికి కేంద్రం వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా విశాఖ ఉక్కు… pic.twitter.com/JIuwLMhhhL
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 20, 2025
ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు విష ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయంటూ ఈ ఫ్యాక్ట్ చెక్ లో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే కేంద్రం ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ విషయంలో ఇచ్చిన వివరణను మాత్రం ఎక్కడా ఇందులో ప్రస్తావించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవమా లేక కేంద్రం ఇచ్చిన వివరణ వాస్తవమా అన్నది తేలడం లేదు. కార్మిక సంఘాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణపై ముందుకెళ్తే మాత్రం మరోసారి ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.
గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమాలు తీవ్రంగా సాాగుతున్న సమయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రంగంలోకి దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించబోమని తేల్చిచెప్పారు. ఆ తర్వాత 10 వేల కోట్లకు పైగా నిధుల్ని కూడా కేటాయించారు. దీంతో ఇక ప్రైవేటీకరణ ముందుకు సాగదని అంతా భావించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పడంతో మరోసారి అనుమానాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications