మళ్లీ భూముల మార్కెట్ విలువ పెంపు - ఎక్కడ ఎంత మేర..!!
భూముల మార్కెట్ విలువ పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ధరల్లో మార్పులు చేస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక సారి ఇప్పటికే భూముల మార్కెట్ విలువ పెంచుతూ నిర్ణయించింది. కాగా, ఇప్పుడు మరోసారి పెంపుకు సిద్దమైంది. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది.
ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రంగం సిద్దం అయింది. ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మార్కెట్ ధరలు, డిమాండ్‌కు అనుగుణంగా సవరించిన భూముల మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అనుమతిచ్చారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీకి మెమో జారీచేశారు.

అలాగే రెండు నెలల్లో భూముల మార్కెట్ విలువల సవరణ వ్యవస్థను ఆధునికీకరించాలని నిర్దేశించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల మార్కెట్ విలువలు గతంలోనే ఒక సారి పెంచింది. కాగా, ఇది రెండోసారి. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను పెంచింది.
అయితే, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ విలువలతో పోలిస్తే తగ్గినట్లు ప్రకటించింది. గత ఏడాది కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్యప్రాంతాల్లో భూముల విలువలు 15 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, మౌలికసదుపాయాల కల్పన, వాస్తవ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ నమోదు విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గించడం కోసం ధరలు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు మరోసారి భూముల మార్కెట్ విలువలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ద్వారా ఖజానాకు రూ.13,150 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనాగా పేర్కొన్నారు. అయితే, నవంబరు నాటికి రూ.7,132 కోట్లు వచ్చినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఇప్పుడు మరోసారి భూముల మార్కెట్ విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ధరలను కొంతమేర పెరగటంతో రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరనుంది.












Click it and Unblock the Notifications