ఏపీలో వితంతు మహిళలకు కూటమి సర్కారు తీపికబురు..
ఆంధ్రప్రదేశ్ లోని వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్లను పెంచారు సీఎం చంద్రబాబు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు దాటినా.. కొత్త ఫించన్లు మాత్రం ఇంత వరకు మంజూరు కాలేదు. కానీ మరోవైపు అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. దీంతో కొత్త పింఛన్లను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు స్వీకరిస్తుందా అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా గంట్యాడలో వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్‌లకు అర్హులుగా ఉన్నారని.. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇక రీసెంట్ గానే అసెంబ్లీ వేదికగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని గుర్తు చేశారు. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న వారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వారికి పింఛను అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు. ఇందు కోసం అధికారులు, మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు. ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇవ్వడం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications