ఇటు "పుష్ప" జాతర - అటు సర్కారు వారి సినిమా : జేసీలకు తాజా ఆదేశాలు - నేడు కీలక పరిణామాలు..!!
ఏపీలో అటు సినిమా టిక్కెట్ ధరలు ఇప్పుడు న్యాయపోరాటంగా మారాయి. ఇదే సమయంలో కోర్టు సూచనలు - ప్రభుత్వ తాజా నిర్ణయాలతో టాలీవుడ్- పొలిటికల్ సర్కిల్స్ ఏం జరుగుతోందనే ఉత్కంఠ సాధారణ ప్రేక్షకుల్లోనూ మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా విడుదలైంది. అర్ద్రరాత్రి నుంచి బన్నీ అభిమానులు సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ఫ పై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ మూవీ పైన పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

థియేటర్ల వద్ద "పుష్ప" జాతర
సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. తెలంగాణలో ఈ సినిమా కోసం అయిదో షో ప్రదర్శనకు ఈ నెల 30వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కోర్టులో పిటీషన్ దాఖలు చేసి..కోర్టు అనుమతి ఇచ్చిన ధియేటర్లలో మినహా మిగిలిన వాటిలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్లు విక్రయించాల్సి ఉంది.

ఏపీలో కనిపించని బెనిఫిట్ షో లు
ఆంధ్రాలో చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడలేదు. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతించలేదు. అన్నిచోట్లా సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 95-100% టికెట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ఇక, ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జీవో 35ని హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దుచేయడం, డివిజన్ బెంచ్‌లోనూ తనకు ఉపశమనం కలగకపోవడంతో ప్రభుత్వం థియేటర్లపై గట్టిగానే దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది.

ఏపీ ప్రభుత్వం తాజా సర్క్యులర్
టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమాన్యాలు జాయింట్ కలెక్టర్ల ముందు ఉంచాలని, ధరలపై జేసీయే నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి ఒక సర్క్యులర్ విడుదల అయింది. ఈ నెల 8 నుంచి 17 వరకు (అంటే శుక్రవారం నాటికి) థియేటర్ యజమానులు ఇచ్చిన విజ్ఞాపనలను నిబంధనల ప్రకారం పరిశీలించి.. వారు కోరినదానిపై న్యాయమైన కారణాలను పేర్కొంటూ ప్రభుత్వానికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విధిగా నివేదిక పంపించాలని జేసీలను అందులో ఆదేశించింది.

జాయింట్ కలెక్టర్ల నుంచి నివేదికలు
అందులో పలు అంశాల పైన స్పష్టత కోరినట్లుగా తెలుస్తోంది. ధియేటర్లలో నిబంధనలు పాటిస్తున్నారా.. ఇతరత్రా అంశాలు అమలవుతున్నాయా అనే కోణంలో ప్రభుత్వం సమాచారం అడిగినట్లుగా చెబుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా థియేటర్ల నిర్వహణ పైన ప్రభుత్వానికి పూర్తి సమాచారం అందనుంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన ప్రతీ అంశం థియేటర్లు పాటించే అవకాశం ఉండదనేది మరో వాదన. సినిమా టిక్కెట్ ధరలతో పాటుగా..బెనిఫిట్ షో ల కు అనుమతి ఇవ్వాల్సింది జాయింట్ కలెక్టర్లదే. నిబంధనల ప్రకారం టికెట్ల ధరల పెంపుదలపై జేసీలు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.

కోర్టు మార్గదర్శకాలతో.. ముందుకు
ఇక, ఇదే సమయంలో న్యాయస్థానం ద్వారానే టిక్కెట్ ధరల పెంపుకు అనుమతి తెచ్చుకోవాలని పలువురు ప్రముఖ నిర్మాతలు - డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పైన డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది. ఆ తరువాత వచ్చే కోర్టు నిర్ణయం ఆధారంగా డైరెక్టర్లు - నిర్మాత లు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లటం.. ఇప్పుడు తాజా ఉత్తర్వుల ద్వారా తమ నిర్ణయం పైన ముందుకే వెళ్లే అవకాశం బలంగా కనిపిస్తోంది.

సీఎం జగన్ తో కలిస్తేనే పరిష్కారమా
అయితే, సాధారణ ప్రేక్షకుల పైన భారం పడకూడదన్నదే తమ విధానమని ప్రభుత్వం చెబుతోంది. న్యాయస్థానం సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ విషయంలో అంతిమంగా ఎటువంటి నిర్ణయం వస్తుంది.. త్వరలో విడుదల కానున్న పెద్ద బడ్జెట్..పెద్ద హీరోల సినిమాల పైన ఏ మేర ప్రభావం ఉండే అవకాశం ఉందనేది మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసి సమస్య పరిష్కారం కోరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications