ఏపీ స్కూళ్లలో మరో కీలక మార్పు ! విద్యార్ధులకు గుడ్ న్యూస్..
ఏపీలోని పాఠశాలల్లో భారీ ఎత్తున విద్యాసంస్కరణలు చేపడుతున్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్కూళ్లలో విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యకు చెక్ పెట్టేలా కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తెస్తోంది. దీంతో విద్యార్ధులకు, వారి తల్లితండ్రులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపీలోని పాఠశాలల్లో పలు సింగిల్, డబుల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో కేవలం ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారు. సింగిల్ టీచర్ స్కూళ్లలో ఆ టీచర్, డబుల్ టీచర్ స్కూళ్లలో ఇద్దరు టీచర్లలో ఒకరు లేదా ఇద్దరు సెలవు పెడితే ఆ ప్రభావం విద్యార్ధులపై ఆ మేరకు తీవ్రంగా పడుతోంది. ఎప్పుడో ఒకరోజు అయితే ఫర్వాలేదు, రోజుల తరబడి సెలవుల్లో ఉంటే ఆ ప్రభావం చదువులపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని స్కూళ్లలో గతంలో పోలిస్తే టీచర్లపై ఒత్తిడి బాగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యాసంస్కరణలకు తోడు మధ్యాహ్న భోజనం, ఇతర కార్యక్రమాల కారణంగా టీచర్లు ఒత్తిడికి గురవుతున్నారు. మామూలు స్కూళ్లలో అయితే ఓ టీచర్ సెలవు పెట్టినా మరో టీచర్ తో నడిపించే పరిస్దితి ఉంటోంది. కానీ సింగిల్, డబుల్ టీచర్ స్కూళ్లలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఉన్నతాధికారులు ఆయా టీచర్లకు సెలవులు నిరాకరిస్తున్నారు. దీంతో వారు చెప్పకుండానే మానేయడం లేదా స్కూలుకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోవడం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అనే వ్యవస్ధ గతంలో తీసుకొచ్చారు. ఇది కూడా పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ను క్లస్టర్ మొబైల్ రిజర్వ్ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి తమ పరిధిలో ఉన్న కనీసం మూడు నుంచి నాలుగు స్కూళ్లను అప్పగించాలని నిర్ణయించారు. ఈ పరిధిలో ఎక్కడ టీచర్ సెలవు పెట్టినా వీరు ఆయా స్కూళ్లకు వెళ్లి బోధన కొనసాగించాల్సి ఉంటుంది. త్వరలో ప్రభుత్వం వీరి కోసం ఓ మొబైల్ యాప్ తెస్తోంది. అందులో ఎక్కడ టీచర్ లేకపోతే అక్కడ వీరిని కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications