రేషన్ కార్డు దారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్..! 4 కోట్ల మందికి లబ్ది..!
ఏపీలో రేషన్ కార్డు దారులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్న తరుణంలో వారికి ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా 4.32 కోట్ల మందికి లబ్ది కలుగుతుందని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు దారులు షాపులకు క్యూ కట్టబోతున్నారు.
ఏపీలో నిత్యావసరాల ధరల మంట నేపథ్యంలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు సతమతమవుతున్న వేళ ప్రభుత్వ కీలక నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.180 (కేజీ) అమ్ముతున్న కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించి ఇప్పటికే 160 రూపాయలు, 150 రూపాయలకు తగ్గించి అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరింత తగ్గించింది.

ఇవాళ్టి నుంచి రూ.67కే కిలో కందిపప్పు, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తెనాలిలో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర, కందిపప్పు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు, చక్కెర అందజేయనున్నారు. దీని ద్వారా నాలుగు కోట్ల 32 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర పంపిణీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications