ఏపీలో రవాణా మంత్రినే లెక్క చేయని ఆర్టీసీ ఈడీ ? బదిలీ వేటు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తోంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేసే పనిలో బిజీగా ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్యలకు ఆదేశాలు ఇస్తోంది. ఈ క్రమంలో ఓ యువ మంత్రిని తన శాఖకు చెందిన అధికారే లెక్కచేయని పరిస్దితి. ఏకంగా మంత్రి మూడుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవాణాశాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్. తన జిల్లా పరిధిలోకి వచ్చే కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావుకు ఓ సమస్య పరిష్కారం కోసం ఆయన ఫోన్ చేశారు. సాధారణంగా అయితే మంత్రి స్ధాయి వ్యక్తులు అధికారులకు ఫోన్లు చేయడం అరుదు. కానీ ఇక్కడ మంత్రిగానే ఏకంగా సదరు అధికారికి ఫోన్ చేయాల్సి వచ్చింది. అయితే మంత్రి గారి ఫోన్ వస్తే సదరు అధికారి వెంటనే ఎత్తి మాట్లాడాలి. కానీ అలా జరగలేదు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏకంగా మూడుసార్లు ఫోన్ చేసినా సదరు ఆర్టీసీ ఈడీ స్పందించలేదు. దీంతో ఆయనకు కోపం నశాలానికి ఎక్కింది. ఆర్టీసీ ఉన్నతాధికారులకు పోన్ చేసి సదరు అధికారి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి గారి కోపం అర్దం చేసుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే ఆర్టీసీ కడప జోన్ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావును విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇలా మంత్రినే పట్టించుకోని అధికారుల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications