టీటీడీ బోర్డు: చంద్రబాబు ఎంపిక వెనుక - పవన్ కోటాలో వీరికే..!!
ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలక మండలిని ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు బోర్డును ఖరారు చేసారు. తిరుమల లడ్డూ వివాదం తరువాత బోర్డు ఛైర్మన్ గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది. దీపావళి వేళ చంద్రబాబు ఈ కమిటీ కూర్పు పూర్తి చేసారు. ఇందులో టీడీపీతో పాటుగా జనసేన, ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఇచ్చారు.
కొత్త బోర్డు కూర్పు వెనుక
టీటీడీ ఛైర్మన్ గా మందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల నాయుడును బోర్డు చైర్మన్‌గా నియమించారు. మాజీ సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును బోర్డు సభ్యుడిగా నియమించారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. టీడీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి బోర్డులో స్థానం దక్కింది. తొలి నుంచి టీడీపీ లోనే ఉన్న తెలంగాణకు చెందిన నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. రాజమండ్రికి చెందిన వ్యక్తి కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది.
టీడీపీ - జనసేన నేతలకు
నంద్యాల జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా క్రిష్ణమూర్తికి మూడో సారి బోర్డు సభ్యుడిగా అవకాశం వచ్చింది. మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవిని సభ్యురాలిగా నియమించారు. ఇక, జనసేన నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డిని సభ్యుడిగా నియమించారు. 2009 నుంచి ఆయన జనసేనాని వెంటే ఉన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి టీటీడీలో చోటు కల్పించారు. ఆమె భర్త ఎం.సి.దాస్ జనసేన పార్టీ ట్రెజరర్‌గా ఉన్నారు. ఇక జనసేన పార్టీ కోటాలో డిప్యూటీ సీఎం పవన్ సన్నిహితుడు, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్‌సాయికి అవకాశం కల్పించారు. తెలంగాణలోని యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి
ఇక ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి జాస్తి సాంబశివరావును నియమించారు. నన్నపనేని సదాశివరావు రాజధాని ప్రాంతానికి చెందిన వారు. నాట్కో తరపున జీజీహెచ్ లో పలు డెవలప్ మెంట్ పనులకు సహకరించారు. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది. కృష్ణమూర్తి మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. కాఫీ వ్యాపారి ఆర్‌ఎన్ దర్శన్, కుప్పం పారిశ్రామిక వేత్త శాంతరామ్, చెన్నైకి చెందిన పి.రామ్మూర్తిని సభ్యులుగా నియమించారు. పి.రామ్మూర్తి తమిళనాడులో టెక్స్‌టైల్స్ వ్యాపారవేత్త. కర్ణాటక నుంచి నరేష్ కుమార్‌కు చోటు కల్పించారు. ఆర్థిక నిపుణుడు సౌరబ్ హెచ్.బోరాకు బోర్డు సభ్యుడిగా స్థానం దక్కింది. గతంలో ఎంసీఐ చైర్మన్‌గా విధులు నిర్వహించిన కేతన్ దేశాయ్ కుమారుడు డాక్టర్ అదిత్ దేశాయ్‌కు బోర్డులో స్థానం లభించింది.












Click it and Unblock the Notifications