TTD: టీటీడీ పాలనలో కొత్త 'చీఫ్' - తాజా నియామకం వెనుక..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. సాంకేతికత వినియోగిస్తూ సేవలను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఏఐ ఆధారిత సేవల కోసం కసరత్తు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో టీటీడీలో పాలనా వ్యవహారాల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందు కోసం తాజాగా కీలక నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ నియామకం పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
ప్రభుత్వం తాజాగా తిరుమల-తిరుపతి దేవస్థానాలకు చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్ నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ ఆయనను సంబంధిత పోస్టుకు నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ చరిత్రలో ఈ తరహా అధికారిని నియమించడం ఇది రెండవ సారి. 2010లో ఐఏఎస్ అధికారి జి.సుధీర్‌ని అప్పటి ప్రభుత్వం ఇదే పోస్టుకు నామినేట్ చేసింది. అప్పుడు కూడా అధికారాలు, విధులు, బాధ్యతలు వంటివేవీ నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజా ఉత్తర్ వుల్లోనూ అదే విధమైన అస్పష్టత నెలకొంది. గతంలో చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా వ్యవహరించిన సుధీర్ ఆ ఏడాదిలో రెండుసార్లు పర్యటించారని సమాచారం.

కాగా, ఆ రెండు సందర్భాలలో టీటీడీకి చెందిన అన్ని విభాగాల అధికారులతో సమావేశమై టీటీడీ లో పాలన ఎలా జరుగుతోంది? కొత్త కార్యక్రమాలను ఎలా అమలు చేస్తున్నారు? అన్న అంశాలపై సమీక్షించి వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత మళ్లీ అలాంటి అధికారిని నియమించడం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నియామకం పై టీటీడీ అధికార వర్గాల్లో స్పష్టత లేదు. ప్రస్తుత టీటీడీ ఈవో, అదనపు ఈవోలను సీఎం చంద్రబాబు ఏరి కోరి బాధ్యతలు అప్పగించారు. వారిద్దరూ సీఎం ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. అయితే, ఇప్పుడు మళ్లీ చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ నియామకం ఎందుకు అవసరమైందనే చర్చ మొదలైంది.ఇటీవలి కాలంలో టీటీడీ ఉన్నత స్థాయి అధికార, అనధికారులు సీఎం చంద్రబాబుకు అక్కడి వ్యవహారాలపై వేర్వేరుగా నివేదికలు ఇస్తున్నట్టు దేవస్థానం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ నివేదికల్లోని కొన్ని అంశాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నందున సీఎం నిష్పాక్షిక సమాచారం, ఫీడ్ బ్యాక్ కోసం ఈ తరహా నియామకం చేపట్టి వుంటారన్న ప్రచారం జరుగుతోంది. సాయిప్రసాద్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అయినప్పటికీ ఆయన సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగివుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సాయి ప్రసాద్ టీటీడీ లో తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications