ఏపీలో వీరికి కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ ముహూర్తం..!!
ఏపీల ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలు పంపిణీ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ అందిస్తోంది. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు వేచి చూస్తున్నారు. కాగా.. తాజాగా ప్రభుత్వం కొత్త పెన్షన్ల పైన కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ చేసిన అధికారులు.. క్షేత్ర స్థాయి నివేదికలు సమర్పించారు. దీంతో.. ఇప్పుడు కొత్త పెన్షన్ల మంజూరు పై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది.
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్నవారిలో కొత్తగా వితంతు పింఛన్ల కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెండు నెలల్లో వీటికి పింఛన్లను పంపిణీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. త్వరలోనే వీటి పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేటగిరీ కింద వితంతు మహిళలకు ప్రతీ నెలా రూ.4 వేల చొప్పున అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.34 లక్షల మందికి పింఛన్లను అందజేస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోందని వివరించారు.

కొత్త పెన్షన్ల పంపిణీ పై తుది కసరత్తు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల మంది పింఛన్లు తీసుకునేవారు మరణించార ని, పింఛన్ తీసుకునే భర్త చనిపోతే భార్యకు వెంటనే స్పాజ్ కేటగిరీ కింద పింఛన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పాజ్ కేటగిరీ కింద 2.45 లక్షల మందికి కొత్తగా పింఛన్లను అందించినట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పింఛన్లను తొలగించిందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 9.56 లక్షల పింఛన్లను తొలగించిందని, తమ ప్రభుత్వం 7856 పింఛన్లను అనర్హుల కేటగిరీలో తొలగించిందని చెప్పారు. దివ్యాంగులు, మిగిలి పించన్లలో ఏ ఒక్కరి పేరు కూడా తొలగించలేదని అన్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పించన్లను మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.













Click it and Unblock the Notifications