మరో ఎన్నికల హామీ అమలు - వారి ఖాతాల్లో నెలకు రూ 3 వేలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లో భాగంగా వేద పండితులకు నెలకు రూ 3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని గుర్తించేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్ ఆలయాలకు అప్పగించారు.
ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ రూ 4 వేలకు పెంచిన ప్రభుత్వం.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రేపు (శుక్రవారం) ప్రారంభించనుంది. ఇక.. ఇప్పుడు మరో హామీ పైన ఫోకస్ చేసింది. ఎన్నికల హామీలో భాగంగా వేద పండితులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వేదిక్ కోర్సు పూర్తయి, మూడేళ్ల నుంచి ఉద్యోగం లేని పండితులకు మాత్రమే ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. తొలివిడతలో భాగంగా 600 మందిని దేవదాయ శాఖ గుర్తించగా.. వారికి భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన లబ్ది దారులను గుర్తించే బాధ్యతలను రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం అప్పగించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, దుర్గమ్మ గుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల నుంచి వేద పండితులకు భృతి అందిస్తారు. అన్ని జిల్లాల్లో ఎంత మంది వేద విద్య అభ్యసించి..నిరుద్యోగులుగా ఉన్నారనే దాని పైన ప్రభుత్వం వివరాలు కోరింది. వీరికి రూ 3 వేలు సంభావన చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిరుద్యోగ భృతి అందుకునే వేద పండితులు వారికి సమీపంలో ఉండే ఆలయాల్లో నిత్యం ఒక గంట పాటు వేద పారాయణ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.












Click it and Unblock the Notifications