విజయవాడ, వైజాగ్ మెట్రోలకు స్పందన కరవు ? సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కూటమి సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని కూడా చెప్తూ వస్తోంది. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా ఈ రెండు కీలక మెట్రో ప్రాజెక్టులకు స్పందన కరవవుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆహ్వానించినా స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఇప్పటికే వాటి గడువును కూడా పొడిగించింది. విశాఖ మెట్రో టెండర్లకు అక్టోబర్ 10వ తేదీ వరకూ, విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ 14వ తేదీ వరకూ గడువుగా నిర్ణయించారు. అయినా స్పందన రావడం లేదని సమాచారం. దీంతో ఈసారి మెట్రో రైల్ కార్పోరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

విజయవాడ,విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు కూడా అవకాశం ఇచ్చామని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.

మెట్రో రైల్ పనులను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభజించడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందని ఆయన తెలిపారు. కాబట్టి ఇతర మెట్రో ప్రాజెక్ట్ ల అధ్యయనం తర్వాత పనులను చిన్న ప్యాకేజిలుగా విభజించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు ప్రాజెక్టులు రికార్డ్ టైమ్ లో పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫేజ్ -1 లో విశాఖలో 46.23 కిమీ,విజయవాడలో 38 కిమీ మేర మెట్రో సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications