"తల్లికి వందనం" ఒక్క బిడ్డకేనా - ప్రభుత్వ మార్గదర్శకాల్లో..!?
ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పై కసరత్తు మొదలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని నాడు హామీ ఇచ్చింది. అందులో భాగంగా రూ 4 వేల పెన్షన్ ను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. ఇక, తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్దుల తల్లులకు రూ 15 వేలు చొప్పున ఇచ్చేలా ప్రకటించిన హామీ పైన తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో కొన్ని సందేహాలు చర్చగా మారుతున్నాయి.
ప్రభుత్వం కసరత్తు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. పథకం కింద రూ 15 వేలు ఇస్తామని చెప్పినా..నిర్వహణ ఖర్చుల పేరుతో రూ వెయ్యి మినహాయించి రూ 14 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అదే సమయంలో ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నా...ఒక పిల్లకు మాత్రమే పథకం అమలయ్యేది. అయితే, టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది. చంద్రబాబు, పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేసారు.

మార్గదర్శకాలు జారీ
ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా ఒక్కో తల్లికి రూ 15 వేలు ఇవ్వనన్నట్లు పేర్కొంది. పథకం అమలు మార్గదర్శకాలతో అధికారికంగా జీవో నెంబర్ 29 విడుదల అయింది. ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ అమలు చేస్తామని చెప్పి..జీవోలో ఈ విధంగా ప్రస్తావన చేయటం పైన ఇప్పుడు లబ్దిదారుల్లో చర్చ సాగుతోంది. ఒక్కో తల్లికి రూ 15 వేలు అని ప్రస్తావన చేయటం ద్వారా..ఒక్కరికే అమలు చేస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి.
లోపించిన స్పష్టత
ఈ పథకం పైన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చ మొదలైంది. బడులు మొదలైన సమయంలో విద్యా కిట్లతో పాటుగా తల్లికి వందనం అమలు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికే పథకం అమలు చేస్తారనే ప్రచారమూ సాగింది. కానీ, తాజా మార్గదర్శకాల్లో అలాంటి షరతులు లేవు. గత ప్రభుత్వం తరహాలోనే అమలు కోసం నిర్దేశించిన డాక్యమెంట్లు..హాజరు శాతం గురించి స్పష్టం చేసారు. అయితే, పథకం ఒక్క బిడ్డకే ఇస్తారా..ఎన్నికల హామీ మేరకు అమలు చేస్తారా అనేది స్పష్టత ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications