జగన్ పై రఘురామ పిటిషన్-విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి..!
ఏపీ హైకోర్టులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ఈ కీలక పరిణామం జరిగింది. ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ద్విసభ్య ధర్మాసనంలో జడ్జి జస్టిస్ రఘునందన్ ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణ మరో జడ్జికి అప్పగించనున్నారు.

ఏపీలో వైసీపీ సర్కార్ నడుపుతున్న సీఎం వైఎస్ జగన్ తన నిర్ణయాలతో ఆయన బంధువులు, వివిధ కంపెనీలకు కోట్ల రూపాయల అనుచిత లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ రఘురామ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు జస్టిస్ రఘునందనరావు సిద్ధమైనా చివరికి ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిల్ పై విచారణ నుంచి జస్టిస్ రఘునందనరావు తప్పుకున్న నేపథ్యంలో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఈ పిటిషన్ ను మరో బెంచ్ విచారించేలా త్వరలో ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ రఘునందనరావు ఎందుకు తప్పుకున్నారన్న దానిపై మాత్రం వివరాలు బయటికి రాలేదు. ఇప్పటికే తాజాగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ విచారణ నుంచి కూడా ఇలాగే హైకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుకున్నారు. దీంతో ఏపీకి సంబంధించిన కేసుల విచారణల నుంచి న్యాయమూర్తులు వరుసగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications